మార్చిలో కేఎంసీ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు | Sakshi
Sakshi News home page

మార్చిలో కేఎంసీ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు

Published Thu, Dec 29 2016 11:19 PM

మార్చిలో కేఎంసీ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు

–ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్‌
కర్నూలు(హాస్పిటల్‌): వైద్య విద్య బోధనలో 60 ఏళ్లు పూర్తి చేసుకున్న కర్నూలు మెడికల్‌ కాలేజిలో వచ్చే మార్చి నెల నుంచి డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్‌ చెప్పారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2006లో జరిగిన గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల కంటే ఘనంగా ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు కళాశాల అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు కర్నూలు జిల్లా చుట్టు పక్కల ప్రాంతాల ప్రజల కోసం వినోదాత్మకంగా, విజ్ఞానదాయంగా ఉండే ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ ఎగ్జిబిషన్‌లో బోధనాసుపత్రిలోని 35 విభాగాల నుంచి స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత వైద్యశిబిరాన్ని మూడురోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు.  ఉత్సవాల్లో భాగంగా ఫాకల్టీని సగౌరవంగా ఆహ్వానించి, ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ వైద్యనిపుణుల ఆద్వర్యంలో విద్యార్థుల నైపున్యాన్ని అభివృద్ధి చేసేలా వైద్యవిజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.
 
         పూర్వ విద్యార్థుల జ్ఞాపకాలు, ప్రస్తుత విద్యార్థుల అపురూప విషయాలతో కలిపి డైమండ్‌ జూబ్లీ సెలెబ్రేషన్స్‌ సావనీర్‌ను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.  ఉత్సవాల్లో అకడమిక్‌ అంశాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రొఫెసర్లతో పలు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు భారత రాష్ట్రపతి, భారత ప్రధాన మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రులకు ఆహ్వానం పంపినట్లు తెలిపారు. కార్యక్రమాలకు సంబంధించి త్వరలో షెడ్యూల్‌ విడుదల చే స్తామని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రామప్రసాద్‌ వెల్లడించారు. సమావేశంలో వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి. చంద్రశేఖర్, ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ లక్ష్మీనారాయణ, డాక్టర్‌ రామక్రిష్ణనాయక్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్‌ ఎస్‌.వెంకటరమణ, వైద్యులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement