మ్యాన్ 'హెల్' | Sakshi
Sakshi News home page

మ్యాన్ 'హెల్'

Published Sat, Aug 13 2016 10:54 PM

మ్యాన్ 'హెల్' - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: నగరంలో మ్యాన్‌హోళ్ల కారణంగా దశాబ్ద కాలంలో 25 మంది కార్మికులు మృత్యువాత పడినా అధికారులు, కాంట్రాక్టర్ల తీరు మారడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోళ్లలోకి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా కార్మికులను దింపొద్దని ఎన్నిసార్లు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. జలమండలి బోర్డు 1989లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి నేటి వరకు సుమారు 25 మంది కార్మికులు మ్యాన్‌హోళ్లలోకి దిగి మృత్యువాతపడడం అందరినీ కలచివేస్తోంది.

కొన్ని నెలలుగా తెరచుకోని మ్యాన్‌హోళ్లలో మురుగు నీటిలో ఉండే కాలుష్య కార కాలు, ఇతర అనుఘటకాలతో మీథేన్, కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్‌డయాక్సైడ్‌ వంటి విషవాయువులు అధిక మొత్తంలో వెలువడతాయి. ఇందులోకి దిగేముందు రెండుగంటల పాటు మ్యాన్‌హోల్‌ మూతను తెరచి ఉంచాలి. ఆ తర్వాత అగ్గిపుల్లను వెలిగించి వాయువులు ఉన్నాయో లేదో చెక్‌ చేసుకున్న తర్వాతే అందులోకి దిగాలి. కానీ నేరుగా మూతలు తెరచి అందులోకి దించుతుండడంతో కార్మికులు సమిధలవుతున్నారు.

సెలవురోజుల్లో పర్యవేక్షణ శూన్యం...
మ్యాన్‌హోల్‌ ప్రమాదాలు ఇటీవల రెండో శనివారం,ఆదివారం, ఇతర పర్వదినాల వంటి సెలవురోజుల్లోనే చోటుచేసుకుంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదాలు జరుగుతుండడం గమనార్హం. సంఘటన జరిగినపుడే హడావుడి చేస్తున్న అధికారులు పనులు జరుగుతున్నప్పుడు ఆయా ప్రాంతాలను కనీసం సందర్శించడంలేదన్న విమర్శలున్నాయి.

సుప్రీం మార్గదర్శకాలకు తిలోదకాలు..
మ్యాన్‌హోళ్లలోకి పారిశుద్ధ్య కార్మికులను దించడాన్ని సుప్రీంకోర్టు గతంలో తప్పుబట్టింది. దీంతో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కార్మికులను మ్యాన్‌హోళ్లలోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ దించరాదని, ఎయిర్‌టెక్‌ యంత్రాలతోనే శుద్ధిచేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కానీ ఈ మార్గదర్శకాలు కాగితాలకే పరిమితమయ్యాయని ఇటీవలి దుర్ఘటనలు రుజువు చేస్తున్నాయని కార్మికసంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

గతంలో నగరంలో జరిగిన ప్రమాదాల్లో మృతిచెందిన జలమండలి కార్మికుల ఉదంతాలు కొన్ని..
సంవత్సరం        మృతిచెందిన కార్మికుని పేరు
1988                 ఉస్మాన్‌
2003                 చంద్రయ్య(నారాయణగూడా)
2004                 మన్నెం(రెడ్‌హిల్స్‌)
2014                 బి.సత్యనారాయణ(ఓల్డ్‌సిటీ)
2015                 రాములు

వీరుకాక మరో 20 మంది వరకు నైపుణ్యంలేని కార్మికులు(అడ్డా కూలీలు) మ్యాన్‌హోళ్లలోకి దిగి మృత్యువాతపడ్డారు. కార్మికులను నేరుగా దింపడంతోనే ప్రాణాలు పోతున్నాయి నైపుణ్యం లేని కార్మికులను నేరుగా మ్యాన్‌హోళ్లలోకి దించడంతోనే వారి ప్రాణాలు పోతున్నాయి. దీనికి అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. కార్మికశాఖ మార్గదర్శకాల ప్రకారం మ్యాన్‌హోళ్లలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ కార్మికులను దించరాదు. ఎయిర్‌టెక్‌ యంత్రాలతోనే శుద్ధిచేయాలి. ప్రతి ఎయిర్‌టెక్‌ యంత్రంపై 6గురు సహాయకులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. 50 మ్యాన్‌హోళ్ల పర్యవేక్షణకు ఒక సీవరేజి కార్మికుడు ఉండాలి. కానీ జలమండలిలో సిబ్బంది లేమి తీవ్రంగాఉంది. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలి. ఆనంద్‌రెడ్డి, జలమండలి సీవరేజి కార్మికుల సంఘం నేత

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: డిప్యూటీ మేయర్‌
గచ్చిబౌలి: మ్యాన్‌ హోల్‌లో పడి మృతి చెందిన వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ఆదుకుంటుందని డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియొద్దీన్‌ తెలిపారు. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే  ఈ దుర్ఘటన జరిగిందని ఆయన పేర్కొన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా ఘటన చోటుచేసుకుందన్నారు. కార్పొరేటర్‌ జగదీశ్వర్‌æ గౌడ్‌ మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన అని అన్నారు.

డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యేతో పాటు జీహెచ్‌ంఎంసీ జోనల్‌ కమిషనర్‌ బి.వి.గంగాధర్‌ రెడ్డి, సర్కిల్‌–12 ఉప కమిషనర్‌ మమత, మాదాపూర్‌ ఏసీపీ రమణకుమార్, సీవరేజ్‌ బోర్డు జీఎం సుదర్శన్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మ్యాన్‌ హోల్‌లో పడి కార్మికులు మృతి చెందడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు ఎం.రవికుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించకుంటే ఆందోళన చేస్తామని వైఎస్సార్‌ సీపీ  రాష్ట్ర కార్యదర్శి బసిరెడ్డి బ్రహ్మానందరెడ్డి, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యదర్శి ఇమామ్‌ హుస్సేన్‌  పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement