లడ్డూ రూ.77,77,777.77 | Sakshi
Sakshi News home page

లడ్డూ రూ.77,77,777.77

Published Thu, Jan 14 2016 3:12 AM

లడ్డూ  రూ.77,77,777.77

♦ సంగారెడ్డిలో శ్రీవిరాట్ వేంకటేశ్వరస్వామి లడ్డూకు రికార్డు ధర
♦ వేలం పాటలో సొంతం చేసుకున్న దామోదర సతీమణి
 
 సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి శివారులోని శ్రీమహాలక్ష్మి గోదా సమేత శ్రీవిరాట్‌వెంకటేశ్వర స్వామి లడ్డూ వేలం పాటలో రికార్డు ధర పలికింది. మునుపెన్నడూ లేని విధంగా రూ.77,77,777.77 వెచ్చించి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని స్వామివారి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంతో లడ్డూను దక్కించుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో బాలాపూర్, కూకట్‌పల్లి ప్రగతినగర్ గణేశ్ లడ్డూ (బాలాపూర్-రూ.9.53 లక్షలు, ప్రగతి నగర్-రూ.15 లక్షలు) వేలం పాటల రికార్డు బ్రేక్ చేసినట్లయింది. ధనుర్మాసం సందర్భంగా శ్రీవైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో యేటా గోదా శ్రీని వాస కల్యాణం జరుగుతుంది.

ఈ సందర్భంగా స్వామి వారి లడ్డూకు వేలంపాట నిర్వహించడం ఆనవాయితీ. గతేడాది నిర్వహించిన వేలం పాటలో టీఆర్‌ఎస్ నేత, ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్ రూ.7.77 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. బుధవారం స్వామివారి కల్యాణం అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ , ప్రధాన అర్చకుడు కందాడై వరదాచార్యులు లడ్డూ వేలం నిర్వహిం చారు. వేలం పాటలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 25 కిలోల లడ్డూకు ప్రారంభ వేలం పాటను రూ.7,777గా నిర్ణయించారు.

అక్కడ్నుంచి వేలం మొదలవగా.. ఆలయ మహిళా కార్యకర్తలు రూ.3.80 లక్షల వర కు పాడారు. ఆ తర్వాత సంగారెడ్డికి చెందిన వైద్యుడు డా.కుమార్ రాజా రూ.55 లక్షలు పాడగా, పురం పాండ య్య కుటుంబీకులు రూ.65 లక్షలకు పాడారు. తర్వాత కుమార్ రాజా రూ.66 లక్షలకు పెంచగా.. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని ఏకంగా రూ.77,77,777.77 వేలం పాట పాడి లడ్డూను కైవసం చేసుకున్నారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్, ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు మాట్లాడుతూ... లడ్డూను కైవ సం చేసుకున్నవారికి అన్నీ శుభాలే కలుగుతాయన్నారు.

 మంచి జరుగుతుందనే విశ్వాసంతోనే: పద్మిని దామోదర
 ఈ లడ్డూను దక్కించుకొనే వారికి అంతా మంచి జరుగుతుందన్న విశ్వాసం ఉంది. అందుకే లడ్డూను కైవసం చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ధర ఎక్కువైందని కాకుం డా.. లడ్డూను దక్కించుకున్నాననే సంతోషం ఉంది.

Advertisement
Advertisement