భూ కైలాస్‌.. | Sakshi
Sakshi News home page

భూ కైలాస్‌..

Published Sat, Jun 24 2017 11:24 PM

భూ కైలాస్‌..

ఎకరం రూ.కోటి పైనే!
కియో కార్ల పరిశ్రమ ఏర్పాటు నేపథ్యంలో భూముల ధరలు పెరిగిపోయాయి. పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూములు కనిపిస్తే చాలు కొనటానికి కర్ణాటక, తమిళనాడు వ్యాపారులు, దళారులు వాలిపోతున్నారు. రూ.లక్షల్లో పలికిన ఎకరం ధర రానురాను కోటి రూపాయల దాకా చేరుకుంది.
- పెనుకొండ

పెనుకొండ నియోజకవర్గంలోని 44వ నంబరు జాతీయ రహదారి సమీపంలోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఏడాది కిందట గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద బెల్‌, నాసన్‌ పరిశ్రమలు వస్తాయని ప్రచారం జరగడంతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. బెంగళూరు పారిశ్రామికవేత్తలు క్యూ కట్టారు. తాజాగా పెనుకొండ మండలం అమ్మవారుపల్లి, ఎర్రమంచి ప్రాంతంలో కియో కార్ల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 600 ఎకరాల భూములను కేటాయించింది. ఎకరా రూ.10.50 లక్షలతో కొనుగోలు చేసిన ప్రభుత్వం భూముల చదునుకు ఎకరాకు రూ.30 లక్షల దాకా వెచ్చించింది. ఈ నేపథ్యంలో కార్ల పరిశ్రమ వల్ల ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని భావించిన వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు భూముల కొనుగోలులో మునిగిపోయారు. ఎకరా రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలకు బేరమాడి అగ్రిమెంట్‌ కుదుర్చుకుని అనంతరం ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ప్రారంభంలో ఈ ధర పలకగా ప్రస్తుతం ఏకంగా ఎకరా రూ.కోటికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది. లోపలి ప్రాంతాల్లో ఉన్న భూములు సైతం రూ. 14  లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పలుకుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన పారిశ్రామిక వేత్తలు వారికి సంబంధించిన పరిశ్రమలు, లాడ్జీలు, హోటళ్ల ఏర్పాటులో నిమగ్నమయ్యారు.

ఇదీ అంతేనా..?
కియో కార్ల పరిశ్రమ పుణ్యమా అని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుంది. అయితే బెల్‌, నాసన్‌ పరిశ్రమల ఏర్పాటు పనులు ప్రారంభ దశలోనే కొట్టుమిట్టాడుతుండగా.. వీటి పరిసర ప్రాంతంలో 8 నెలల క్రితం భూములకు విపరీతమైన డిమాండ్‌ ఉండేది. అయితే ‘బెల్‌’కు కాంపౌండ్‌ నిర్మించి తదుపరి పనులు పట్టించుకోలేదు. నాసన్‌ పరిశ్రమ ఊసే కనిపించడం లేదు. దీంతో ఈ ప్రాంతంలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాలు మందగించాయి.  ఇదే తరహాలో ఇప్పుడు కియో కార్ల పరిశ్రమ ఏర్పాటు ఉంటుందా.. లేక విజయవంతం అవుతుందా అనేది అనుమానాస్పదంగా ఉంది.

Advertisement
Advertisement