మామిడిపాలెంలో బంజరు ఆక్రమణ..విలువ రూ.36 కోట్లు | Sakshi
Sakshi News home page

మామిడిపాలెంలో బంజరు ఆక్రమణ..విలువ రూ.36 కోట్లు

Published Thu, Jul 28 2016 12:52 AM

landgrab in mamdipalem

తగరపువలస: జీవీఎంసీ భీమిలి జోన్‌ సంగివలస డివిజన్‌ 24వ వార్డు మామిడిపాలెంలో రాత్రి వేళ విలువైన బంజరుభూమిని ఆక్రమణదారులు చదును చేస్తున్నారు. దీనిపై స్థానికులు భీమిలి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ సర్వే నంబర్‌ 137లో 30 ఎకరాల వరకు బంజరు భూమి ఉంది. దీనికి ఒకవైపు జీవీఎంసీకి చెందిన నమ్మివానిపేట డంపింగ్‌ యార్డు, మరోవైపు వరల్డ్‌ అమేయా స్కూల్‌ ఉంది. ఇక్కడ ఆక్రమణకు ప్రయత్నించిన స్థలం మార్కెట్‌ విలువ రూ.36 కోట్ల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఇదే సర్వే నంబర్‌లో గ్రామానికి చెందిన శ్మశానవాటిక ఉండేదని, దీనిని సైతం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీని ఆక్రమణ వెనుక అధికారపక్షం నేతల హస్తం ఉన్నట్టు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దీనిపై సంగివలస వీఆర్వో ప్రసాద్‌ను వివరణ కోరగా గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మంగళవారమే వెళ్లి తనిఖీ చేయగా అది బంజరుభూమి అని తేలిందన్నారు. ఇందులో పనులు నిర్వహించకూడదని హెచ్చరించామన్నారు. బుధవారం కూడా ఆర్‌ఐను తీసుకువెళ్లి ఆక్రమణలను పరిశీలించామన్నారు. భీమిలి తహసీల్దార్‌ బి.టి.వి.రామారావు దష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
 
 

Advertisement
Advertisement