పోలింగ్‌ కేంద్రాల వద్ద నేతల హల్‌చల్‌ | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల వద్ద నేతల హల్‌చల్‌

Published Thu, Sep 8 2016 8:02 PM

వెలికట్టలో ఓటు వేయడానికి బారులు తీరిన ఓటరులు - Sakshi

కొండపాక: కొండపాక మండలంలోని వెలికట్ట ఎంపీటీసీ స్థానానికి గురువారం జరిగిన ఉపఎన్నిక పోలింగ్‌ కేంద్రాల వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు హల్‌చల్‌ చేశారు.  గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా 7.30 గంటల నుంచి ఓటర్లు కేంద్రాలకు రావడం ప్రారంభమైంది.

వెలికట్ట ఎంపీటీసీ పరిధిలో జప్తినాచారం మధిర రాజంపల్లి, దోమలోని పల్లి, ముర్కోనిపల్లి, వెలికట్ట మధిర విశ్వనాథపల్లి, ఆరేపల్లి, రవీంద్రనగర్‌ గ్రామస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెలికట్ట ఎంపీటీసీ పరిధిలో సుమారు  2422 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఈ ఉప ఎన్నిక బరిలో టీఆర్‌ఎస్‌ నుంచి యాదం మల్లవ్వ, కాంగ్రెస్‌ నుంచి కోడెల వెంకటేశ్వర్లు, టీడీపీ నుంచి వాసరి చిన్న ఐలయ్య, బీజేపీ అభ్యర్థి ముస్తాల నర్సింహులు ఉన్నారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద ఆయా పార్టీల మద్దతుదారులు తమ పార్టీ అభ్యర్థి గుర్తుకే ఓటువేయాలని ఓటర్లను వేడుకోవడం కనిపించింది. ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో పోలింగ్‌కేంద్రాల వద్ద అధికార పార్టీ నాయకులు హల్‌చల్‌ చేస్తూ తమ కార్యకర్తలను ఉరుకులు పరుగులు పెట్టించారు.

వెలికట్ట, విశ్వనాథపల్లి గ్రామాల్లో పోలింగ్‌ బూత్‌ల వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు పీఏసీఎస్‌ డైరెక్టర్‌ అనంతుల నరేందర్‌, సర్పంచ్‌లు యాదగిరి, కనకారెడ్డి, రుషి, కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ సలీం, కార్యకర్తలు కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే కాంగ్రెస్‌ నాయకులు మంచాల శ్రీనివాస్‌, ప్రతాప్‌చందర్‌, టీడీపీ నాయకులు శ్రీనివాస్‌, కనకాచారి, అంబటి నారాయణ, అహ్మద్‌ వారి అనుచరులు కూడా తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు.

పోలింగ్‌ సరళి అధికారపార్టీకే అనుకూలంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వెలికట్ట పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు అధికార పార్టీ నేతలు టిఫిన్‌ తీసుకెళుతున్నారని పోలింగ్‌ తీరును పరిశీలించేందుకు వచ్చిన ఎన్నికల అధికారి సురేష్‌కు కాంగ్రెస్‌ అభ్యర్థి కోడెల వెంకటేశం ఫిర్యాదు చేశారు.

అధికారుల తీరుపై మండిపడుతూ మరోసారి ఇలాంటివి పునరావృత్తంకాకుండా చూసుకోవాలని మందలించారు. ఈ ఉపఎన్నికలో ఈవీఎంల ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవడంలో ఓటర్లు ముఖ్యంగా వృద్ధులు కాస్త తికమకపడ్డారు. రేపు కొండపాక ఎంపీడీఓ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Advertisement
Advertisement