ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది...! | Sakshi
Sakshi News home page

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది...!

Published Sun, Oct 18 2015 1:31 AM

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది...! - Sakshi

రాజకీయాల్లో తలపండినవాళ్లు, పెద్ద పెద్ద పదవులు నిర్వహించిన వారు పార్టీలోకి వస్తే ఏదో జరుగుతుందని అనుకుంటే ఇంకేదో అయినట్లుగా ఉందని కమలనాథులు వాపోతున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయిల్లో మంత్రి పదవులు నిర్వహించి, రాజకీయాల్లో ప్రముఖులుగా ఉన్న వారు బీజేపీలో చేరినా ఏపీలో పార్టీ పరిస్థితిని మార్చడంలో మాత్రం వారి నుంచి కించిత్తు కూడా ప్రయోజనం కలగలేదని పెదవివిరుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు చేరడంతో పార్టీలో నేతల బరువు ఎక్కువైపోయి, మోయలేని పరిస్థితికి పార్టీ చేరుకుందని అంతర్గత చర్చల్లో నాయకులు చెవులు కొరుక్కుంటున్నారట. పార్టీ విత్ ఏ డిఫరెన్స్ అంటూ గతంలో గొప్పలు చెప్పుకుని ఇటువంటి వాళ్లనందరినీ చేర్చుకోవడంపై సంప్రదాయ వాదులు నాయకత్వాన్ని తప్పుబడుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి.
 
 పార్టీ కీలక పదవులన్నీ ఈ విధంగా బయటనుంచి వచ్చిన వారికే ఎక్కువశాతం దక్కడం ఏమిటని కూడా రాష్ట్రనేతలు రగిలిపోతున్నారట. కేంద్ర ప్రభుత్వంపై, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంపై బీజేపీపై విమర్శలు వచ్చినపుడు కూడా ఈ నేతలు కనీసం నోరువిప్పి విమర్శలు తిప్పికొట్టకపోవడాన్ని పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. పోని వారి ద్వారా పార్టీకి ఏదైనాలాభం జరిగిందా ఏమీ లేదని, అటువంటపుడు ఈ బరువును దించుకోవడమే మంచిదనే సూచనలు కూడా వస్తున్నాయట. ఏపీలో పార్టీకి నాయకుల కంటే కూడా కేడర్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు. అదీగాకుండా ఎప్పటినుంచో పార్టీలోనే ఉంటున్న నాయకులను ప్రోత్సహించాలని, ఎన్నికలకు ముందు ఇతరపార్టీల నుంచి వచ్చినవారి ప్రాధాన్యతను తగ్గించాలనే డిమాండ్ కూడా పెరుగుతోందట.

Advertisement
Advertisement