అప్పులోళ్లూ.. క్షమించండి | Sakshi
Sakshi News home page

అప్పులోళ్లూ.. క్షమించండి

Published Wed, Apr 6 2016 4:13 AM

అప్పులోళ్లూ.. క్షమించండి - Sakshi

♦ ఇల్లమ్ముకుని అప్పు కట్టుకోండి
♦ కౌలు రైతు సూసైడ్ నోట్
♦ అప్పు కిస్తీ కోసం సోమవారమే బైక్ విక్రయం
 
ఇల్లంతకుంట: ‘మీ దగ్గర అవసరానికి అప్పు తెచ్చుకున్న. సమయానికి తీరుద్దామంటే నాకున్న ఒక్కటే ఆస్తి ఇల్లు. అది ఎవరూ కొంటలేరు. మీ అప్పు తీర్చలేకపోతున్న.. నన్ను క్షమించండి... ఇల్లు అమ్ముకుని మీ అప్పు తీసుకోండి’ అంటూ ఓ కౌలు రైతు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్‌పేటకు చెందిన రైతు సామ మోహన్‌రెడ్డి(50) పం టల పెట్టుబడి, కుటుంబపోషణ నిమిత్తం భారీగా అప్పులు చేశాడు. దీంతో తనకున్న ఆరెకరాల భూమిని అమ్మేసి అప్పులు కట్టాడు.

కేవలం 5 గుంటల భూమి మాత్రమే మిగిలింది. ఇంకా రూ.8 లక్షల అప్పు ఉంది. మూడేళ్లుగా అదే గ్రామంలో 11 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మొదటి ఏడాది దిగుబడి బాగానే వచ్చినప్పటికీ గతేడాది, ఈ ఏడాది వర్షాలు లేక పెట్టుబడి కూడా దక్కలేదు. అప్పులు పెరిగిపోవడం, అప్పులిచ్చినోళ్లు బాకీ తీర్చాలని ఒత్తిడి తెస్తుండడంతో ఇల్లు అమ్ముదామని ప్రయత్నించాడు. ఎవరూ కొనకపోవడంతో ఇక ఆత్మహత్యే శరణ్యమని మంగళవారం వేకువజామున చేను వద్దకు వెళ్లి క్రిమిసంహా రక మందు తాగాడు. భర్త తెల్లవారినా ఇంటికి రాకపోవడంతో భార్య జయ చేను వద్దకు వెళ్లి చూడగా చనిపోయి ఉన్నాడు. మోహన్‌రెడ్డికి భార్య , ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సూసైడ్ నోట్‌లో తెలంగాణ ప్రజలు బాగుండాలని, సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ తీసుకురావాలని రాశాడు.



 కిస్తీకి బైక్ విక్రయం..
 మోహన్‌రెడ్డి తనకున్న ఐదుగుంటల స్థలంలో రెండు గుంటల్లో షెడ్ వేసి ఆవులు పెంచేందుకు బ్యాంకు రుణం తీసుకున్నాడు. ఆవులను కొనుగోలు చేసి కొన్ని రోజులు బాగానే నడిచాక, పాల ధర తగ్గడం తో ఒక్కోటి రూ.55 వేలకు కొనుగోలు చేసిన ఆవును రూ.35 వేలకే అమ్మేశాడు. రూ.లక్ష మేర నష్టపోయా డు. ఆవులు అమ్మిన విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు అప్పు తీర్చాలని పట్టుబట్టడంతో సోమవారం తన బైక్ అమ్మి నెలసరి వాయిదా కట్టాడు.
 
 రైతు ఆత్మహత్యలు ఆపలేకపోతున్నాం: ఈటల
 జమ్మికుంట: ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా... ఎన్ని రుణాలు మాఫీ చేసినా... ఉచిత కరెంట్ ఇచ్చినా... రైతుల ఆత్మహత్యలు ఆపలేకపోతున్నామని మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై రైతులకు నిర్వహిం చిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. రైతు ఆత్మహత్యలు నివారించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టనుం దని, రైతులకు పూర్తిస్థాయి భరోసా, నమ్మకం కలిగేలా చర్యలు చేపడతామన్నారు. రైతుల ఆలోచనల్లో మార్పులు తీసుకువస్తేనే ఆత్మహత్యలు కట్టడి చేయొచ్చన్నారు. మూడేళ్లలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేసే ఆలోచనల్లో ప్రభుత్వం ఉందన్నారు.

Advertisement
Advertisement