అమరావతికి లైన్‌ క్లియర్‌ | Sakshi
Sakshi News home page

అమరావతికి లైన్‌ క్లియర్‌

Published Sat, Feb 4 2017 11:07 PM

అమరావతికి లైన్‌ క్లియర్‌

రాజధానికి రైలు మార్గం
రూ.2,680 కోట్ల నిధులు కేటాయింపు

  • విజయవాడ – అమరావతి – గుంటూరు కలిపి రైల్వే లైను
  • 106 కిలోమీటర్ల మేర నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌
  • నడికుడి – శ్రీకాళహస్తి పనులకు రూ.340 కోట్లు మంజూరు
  • తెనాలి–గుంతకల్‌ డబ్లింగ్‌ పనులకు రూ.174 కోట్లు
  • మచిలీపట్నం పోర్టు వరకు గుడివాడ రైల్వే లైన్‌ పొడిగింపు
  • కాజీపేట–విజయవాడ మధ్య నాలుగో లైన్‌ సర్వేకు అనుమతి

సాక్షి, విజయవాడ : రాష్ట్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతానికి రైలు మార్గం ఖరారైంది. రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వం చేసిన వినతులకు ఎట్టకేలకు కేంద్ర రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో రైల్వే బడ్జెట్‌లో గుంటూరు, కృష్ణా జిల్లాలకు పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులు కేటాయించారు. విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్‌ల పరిధిలో ఇప్పటికే కొన్ని పనులు కొనసాగుతున్నాయి. వాటికి నిధుల కేటాయింపుతో పాటు, కొత్త ప్రాజెక్టులు మంజూరు చేశారు. ప్రధానంగా విజయవాడ – అమరావతి – గుంటూరులను కలుపుతూ 106 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

స్వల్పంగా పెరిగిన కేటాయింపులు...
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం సాధారణ బడ్జెట్‌తో పాటు రైల్వే బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పార్లమెంటు సభ్యులు పలు ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు, కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ క్రమంలో వాటిలో కొంతమేర కేటాయింపులు జరిగాయి. గత ఏడాది కంటే కేటాయింపుల సంఖ్య కొంత పెరిగింది. గత రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.2,195 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించగా, ఈసారి రూ.3,406 కోట్ల నిధులు కేటాయించారు.

రాజధానికి రైల్వే లైన్‌...
రైల్వే బడ్జెట్‌లో ప్రధానంగా రాజధాని ప్రాంతమైన అమరావతికి రైలు మంజూరైంది. సీఎం చంద్రబాబు సహా రెండు జిల్లాల ఎంపీలు రైలు మార్గం కోసం అనేక పర్యాయాలు వినతి పత్రాలు ప్రభుత్వానికి అందజేశారు. విజయవాడలో నిర్మించనున్న మెట్రో రైలు మార్గాన్ని రాజధాని వరకు కొనసాగించే విషయంపైనా తర్జనభర్జనలు, పరిశీలన జరిగింది. ఈ పరిణామాల క్రమంలో రైల్వే బడ్జెట్‌లో కొత్త రైలు మార్గానికి నిధులు మంజూరయ్యాయి. విజయవాడ నుంచి రాజధాని ప్రాంతమైన అమరావతి (తుళ్లూరు), అక్కడి నుంచి గుంటూరుకు సర్క్యూట్‌ రైలు తరహాలో రాకపోకలు నిర్వహించడానికి వీలుగా రైల్వే లైను నిర్మించనున్నారు. మొత్తం 106 కిలోమీటర్ల నిర్మించే లైనుకు రూ.2,680 కోట్లు నిర్మాణ వ్యయంగా నిర్ణయించి కేటాయింపులు జరిపారు. ప్రాజెక్టు ఖరారు చేసి బడ్జెట్‌లో కేటాయింపులు జరగడంతో మరో రెండు నెలల కాలవ్యవధిలో టెండర్ల దశ దాటి పనులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.

నడికుడి లైనుకు రూ.340 కోట్లు
నిర్మాణ పనులు ప్రారంభమైన నడికుడి– శ్రీకాళహస్తి రైల్వేలైనుకు 2017–18 సంవత్సరానికి రూ.340 కోట్లు కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.2,330 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు గత రెండు బడ్జెట్లు కలిపి రూ.290 కోట్లు కేటాయించారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలో 42 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రైలు మార్గానికి సంబంధించి ఇద్దరు కాంట్రాక్టర్లకు రెండు వర్కులుగా విభజించి కేటాయించారు. అయితే స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి మామూళ్ళ వేధింపులతో ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ వ్యవహారం కేంద్ర రైల్వే శాఖ దృష్టికి వెళ్ళింది. గత నెల రోజులుగా పనులు నిలిచిపోయిన క్రమంలో బడ్జెట్‌లో కేటాయింపులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కేటాయింపులు ఇవే...
విజయవాడ – గుడివాడ లైనును మచిలీపట్నం పోర్టు వరకు పొడిగించాలని నిర్ణయించి దానికి రూ.130 కోట్లు కేటాయించారు. దీనివల్ల మచిలీపట్నం పోర్టు నుంచి సరకు రవాణా సులభం అవుతుంది. పది కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రైలు మార్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తాయి.

► కాజీపేట–విజయవాడ మధ్య మూడో లైను ఇప్పటికే మూడొంతులు పూర్తయింది. దీనికి రూ.100 కోట్లు కేటాయించారు. అంతేగాక కాజీపేట–విజయవాడ మధ్య నాలుగో లైను ఏర్పాటుకు సర్వే చేయించేందుకు రైల్వేశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
► విజయవాడ – భీమవరం – నిడదవోలు మధ్య 221 కిలోమీటర్ల డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌కు రూ.122 కోట్లు కేటాయించారు.
► విజయవాడ – గూడూరు మధ్య 287.67 కిలోమీటర్ల మేర మూడో ట్రాక్‌ నిర్మాణానికి సంబంధించి రూ.100 కోట్లు కేటాయింపు
► కొండపల్లి – కిరండోల్‌ మధ్య రైల్వే లైనుకు అనుమతి లభించింది.
► కోటిపల్లి– నర్సాపురం– మచిలీపట్నం మార్గానికి రూ.430 కోట్లు కేటాయించారు.
► గుంటూరు– తెనాలి రైల్వే లైన్‌ మధ్య 24.38 కిలోమీటర్లు డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌ పనులకు రూ.36 కోట్లు కేటాయింపు
► గుంటూరు  – గుంతకల్లు మధ్య 463 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌ పనులకు రూ.124 కోట్ల కేటాయింపు
► రాయనపాడు రైల్వే కోచ్‌ మెయింటెనెన్స్‌ పనులకు రూ.8.7 కోట్లు కేటాయింపు
► గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో 72 రైల్వే స్టేషన్‌లలో  సుమారు రూ.1.2 కోట్ల నిధులతో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు
► రూ.79 కోట్లతో జగ్గయ్యపేట, మేళ్ళచెరువు, జాన్‌ఫహాడ్‌ల మధ్య 24 కిలోమీటర్ల రైల్వే లైను నిర్మాణానికి అనుమతి

Advertisement

తప్పక చదవండి

Advertisement