అద్దెకు రెక్కలు | Sakshi
Sakshi News home page

అద్దెకు రెక్కలు

Published Tue, Sep 20 2016 12:34 AM

అద్దెకు రెక్కలు

  • నెల ముందుగానే బుకింగ్‌ షురూ
  • లాడ్జిలన్నీ హౌస్‌ఫుల్‌ అంటున్న నిర్వాహకులు
  • సమ్మెటివ్‌ పరీక్షల నేపథ్యంలో జాతర సిబ్బందికీ వసతి కరువే
  • వెంకటగిరి: పోలేరమ్మ జాతర వెంకటగిరిలోని లాడ్జి యజమానులకు కాసులవర్షం కురిపిస్తోంది. జాతరలో అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల్లో పలువురు లాడ్జిల్లో ఆశ్రయం పొందుతారు. అయితే ఈ ఏడాది లాడ్జిల నిర్వాహకుల చెప్పే అద్దెలు విని నోరెళ్లబెడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారిని దోచుకునేందుకు లాడ్జిల యజమానులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. నెలముందే బుకింగ్‌లు ప్రారంభమైనప్పటికీ హౌస్‌ఫుల్‌ అని సమాధానమిస్తున్నారు. ఎలాగోలా చేయాలని కోరితే చేంతాడంత అద్దెలు చెబుతున్నారు. పట్టణంలో సాధారణ రోజుల్లో రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు అద్దె వసూలు చేస్తారు. ప్రస్తుతం జాతర నేపథ్యంలో ఆరు రెట్లు వరకు పెంచి గదుల స్థాయి(ఏసీ, నాన్‌ఏసీ)రూ.2 వేలు నుంచి రూ.6 వేలు వరకు వసూలు చేస్తున్నారు. ఇక బుధవారం ఏ సమయంలో రూము తీసుకున్నా, గురువారం ఉదయం 10 గంటల వరకు తప్పనిసరిగా ఉంచుకుని రెండు రోజుల అద్దె చెల్లించాల్సిందేనని షరతులు పెడుతున్నారు. 
    అధికారులకు తప్పని తిప్పలు
    జాతర విధుల్లో పాలుపంచుకునేందుకు వచ్చే పోలీసులు, వివిధ శాఖల అధికారులకు ఏటా పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, మదర్‌ అకాడమి స్కూలుతో పాటు పలు పాఠశాలల్లో వసతి కల్పిస్తారు. అయితే ఈ ఎడాది ఈనెల 21వ తేదీ నుంచి సమ్మెటివ్‌ ఎసెసెమెంట్‌ –1 పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. సరిగ్గా జాతర ప్రారంభమయ్యే 21వ తేదీన సంస్కృతం సబ్జెక్టుతో పరీక్షలు ప్రారంభం అవుతాయి. వెంకటగిరిలోని ఉన్నత పాఠశాల స్థాయిలో సంస్కృతం సబ్జెక్ట్‌æ లేకపోవడంతో 22వ తేదీన ప్రారంభంకానున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్‌లుగా ఈ పరీక్షలు నిర్వహించనుండడంతో జాతర విధులకు హజరయ్యే సిబ్బందికి వసతి ఏర్పాటుపై స్థానిక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. లాడ్జి యజమానులను కొన్ని గదులు కేటాయించాలని హుకుం జారీ చేస్తుండడంతో వారి ఆశలకు గండిపడనుంది. ఇక ప్రత్యామ్నయంగా స్థానికంగా ఉన్న కల్యాణ మండపాలను సిబ్బంది వసతి కోసం వినియోగించే చర్యలు చేపట్టారు. 

Advertisement
Advertisement