సత్వర న్యాయమే లోక్‌ అదాలత్‌ ధ్యేయం | Sakshi
Sakshi News home page

సత్వర న్యాయమే లోక్‌ అదాలత్‌ ధ్యేయం

Published Sun, Aug 14 2016 12:59 AM

సత్వర న్యాయమే లోక్‌ అదాలత్‌ ధ్యేయం

కర్నూలు(లీగల్‌) : 
కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్‌ అదాలత్‌ ధ్యేయమని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి అన్నారు. శనివారం ఉదయం 10:30 గంటలకు స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్‌ అదాలత్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు సమన్వయంతో పనిచేసి లోక్‌ అదాలత్‌ ద్వారా పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కషి చేయాలని పిలుపునిచ్చారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కె.ఓంకార్‌ మాట్లాడుతూ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార వేదిక లోక్‌ అదాలత్‌ అన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్‌.ప్రేమావతి, 4వ అదనపు జిల్లా జడ్జి టి.రఘురాం, లోక్‌ అదాలత్‌ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి శివకుమార్, జూనియర్‌ సివిల్‌ జడ్జీలు టి.రామచంద్రుడు, కె.స్వప్నరాణి, మెజిస్ట్రేట్స్‌ పి.రాజు, ఎం.బాబు, న్యాయవాదులు రంగారవి, వాడాల ప్రసాద్, శివ సుదర్శన్, నిర్మల, సుమలత, సి.లోకేష్, ఎం.ఎ.తిరుపతయ్య పాల్గొన్నారు. 
1,218 కేసులకు పరిష్కారం.. 
జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 1,218 కేసులకు పరిష్కారం లభించినట్లు లోక్‌ అదాలత్‌ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్‌ తెలిపారు. కర్నూలులో 535 కేసులు, ఆదోనిలో 8, ఆళ్లగడ్డలో 33, ఆత్మకూరులో 87, నంద్యాలలో 162, కోవెలకుంట్లలో 39, ఎమ్మిగనూరులో 21, డోన్‌లో 81, ఆలూరులో 19, పత్తికొండలో 102, బనగానపల్లెలో 14, నందికొట్కూరులో 88 కేసులకు పరిష్కారం లభించిందన్నారు. కేసుల పరిష్కారంలో రాష్ట్రవ్యాప్తంగా కర్నూలు జిల్లాకు రెండో స్థానం దక్కింది. 106 రోడ్డు ప్రమాద కేసుల్లో రూ. 2.70 కోట్లు బాధితులకు ఇచ్చేందుకు బీమా కంపెనీలు అంగీకరించాయి.
 

Advertisement
Advertisement