Sakshi News home page

కోనేటిరాయుని చెంత చెల్లని నోటు

Published Mon, Mar 27 2017 3:16 AM

కోనేటిరాయుని చెంత చెల్లని నోటు

కోనేటిరాయుని చెంత రూ.8.29 కోట్ల పెద్ద నోట్లు
చెల్లుబాటు కావని తేల్చిన  కేంద్ర ప్రభుత్వం


వడ్డీకాసులవాడి హుండీ కానుకలు ఏటేటా పెరుగుతున్నాయి. టీటీడీ చరిత్రలోనే 2016–17 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.1,110 కోట్లు లభించాయి. చరిత్రలో తొలిసారి భక్తులు సమర్పించిన కానుకల్లో రూ.8.29 కోట్లు చెల్లనివిగా మిగిలిపోయాయి.

తిరుమల: వెంకన్న ఖజానాలో రూ.8.29 కోట్ల మేర రద్దు చేసిన పెద్ద కరెన్సీ నోట్లు మూలనపడ్డాయి. ఈ నోట్లు ఇక చెల్లవని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. భక్తులు తీవ్ర వేదనకు లోనవుతున్నారు.

ప్రయత్నించినా.. ఫలితం లేదన్నా?
నవంబర్‌ 8న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసిన విషయం తెలిసిందే. ఉన్న నోట్లను  డిసెంబర్‌ 30లోపు మార్పిడి చేసుకునే వెసులుబా టు ఇచ్చింది. తర్వాత రద్దుచేసిన కరెన్సీ నోట్లు చెల్ల నివిగా ప్రకటించింది. ఈ సమాచారం తెలిసో, తెలియకో భక్తులు కొందరు తమ వద్ద ఉన్న రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను హుండీలో సమర్పించారు.  డిసెంబర్‌ 31వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు టీటీడీ వద్ద రూ.8.29 కోట్లు చేరాయి. వాటిని మార్పిడి చేసుకునేందుకు టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు పలుమార్లు కేంద్ర ఆర్థికశాఖ, రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఉన్నతాధికారులకు లేఖలు రాసి, సంప్రదింపులు జరిపారు. ఫలితం లేకుండా పోయింది.

అవి చెల్లని కాసులే
టీటీడీ ఖజానాలో   పేరుకుపోయిన రద్దు చేసిన రూ.500, రూ.1000 కరెన్సీ విషయమై రాజంపేట వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ శుక్రవారం లిఖిత పూర్వకంగా బదులిచ్చారు. నిర్దిష్ట బ్యాంకు నోట్ల చట్టం–2017 ప్రకారం డిసెంబర్‌ 30 తర్వాత రద్దు చేసిన పాత కరెన్సీ నోట్లు మార్చుకోవడానికి వీల్లేదని తెలిపారు.

చెల్లే కాసులేస్తేనే మొక్కులు తీరేది
హుండీలో చెల్లే కానుకలు సమర్పిస్తేనే మొక్కులు తీరుతాయని గతంలో అర్చకులు, పీఠాధిపతులు స్పష్టం చేశారు. ఈ విషయంలో శ్రీవారి ఆలయ అర్చకులతోపాటు విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామి కూడా భక్తులకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ నేటికీ హుండీలో రద్దు చేసిన కరెన్సీ నోట్లు లభిస్తుండటం గమనార్హం.         

Advertisement
Advertisement