కుప్పల తెప్పలు | Sakshi
Sakshi News home page

కుప్పల తెప్పలు

Published Wed, Nov 2 2016 11:20 PM

lot of applications come to bps

- బీపీఎస్‌ దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర జాప్యం
 -నెలాఖరు వరకు గడువు
- జిల్లాలో 3 వేల దరఖాస్తులు పెండింగ్‌
తణుకు :
అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం చేసుకున్న దరఖాస్తులు మునిసిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ కార్యాలయాల్లో కుప్పలుగా పడివున్నాయి. వాటి పరిష్కారం తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌ (బీపీఎస్‌) కింద భవన యజమానుల నుంచి నిర్ధేశిత ఫీజుల వసూలు గడువును నెలాఖరు వరకు పొడిగిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాదిలో నాలుగోసారి గడువు పెంచుతూ ఉత్తర్వులు వెలువడటం విశేషం. బీపీఎస్‌ దరఖాస్తులను కంప్యూటరైజ్‌ చేసినప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో నిర్ధేశిత సొమ్ము చెల్లించే విషయంలో భవన యజమానుల నుంచి స్పందన కరువైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం సమకూరడం లేదు. 
 
పరిష్కారం అంతంతే..
జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థతోపాటు భీమవరం, నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలకు 4,634 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 1,319 మాత్రమే పరిష్కారమయ్యాయి. 3,313 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. గతేడాది మే 22న బీపీఎస్‌ ప్రకటించిన మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ అదే నెల 27 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. స్పందన లేకపోవడంతో తొలుత రెండు నెలలు ఇచ్చిన గడువును మరో రెండు నెలలు పొడిగించింది. తర్వాత పలుమార్లు పొడిగించుకుంటూ గత ఏడాది డిసెంబరు నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించారు. అప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉన్నా ఆన్‌లైన్‌లో సమస్యల కారణంగా ఆశించిన పురోగతి సాధించలేకపోయారు. దీంతో 3,313 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. భారీగా ఆదాయం సమకూరుతుందని భావించినా ఇప్పటివరకు సుమారు రూ.20 కోట్లు మాత్రమే సమకూరింది. ఈ నేపథ్యంలో మరోసారి గడువు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 
 
 
 

Advertisement
Advertisement