Sakshi News home page

మ‘ధనం’

Published Sun, Jan 22 2017 11:23 PM

మ‘ధనం’

- డీసీసీబీలో తగ్గుతున్న మూలధనం వాటా
- 9 శాతం కన్నా పడిపోతే ఆర్‌బీఐ 
  లైసెన్స్‌ రద్దు అయ్యే ప్రమాదం
- రుణ పథకాల ద్వారా వాటాను
  పెంచుకునేందుకు యత్నాలు
- నోట్ల రద్దుతో నిలిచిపోయిన రుణ పథకాలు
 
కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) కష్టాల్లో కూరుకుపోయింది. మూలధన నిల్వలు పడిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బ్యాంకులో సమస్యాత్మక ఆస్తులు (వసూలు కాని రుణాలు) పెరిగిపోతున్నాయి. వీటికి తోడు..కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో సహకార బ్యాంకు అమలు చేస్తున్న రుణ పథకాలకు గడ్డుకాలం ఎదురైంది. మూలధనం వాటా తొమ్మిది శాతం కన్నా పడిపోతే ఆర్‌బీఐ లైసెన్స్‌ రద్దయ్యే ప్రమాదం పొంచి ఉంది. 
 
మార్చినాటికి పరిస్థితి మెరుగయ్యేనా?
 డీసీసీబీ.. గత ఏడాది నుంచి కర్షకజ్యోతి, కాంపోజిట్‌, దీర్ఘకాలిక రుణపథకాలు అమలు చేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ రుణ పథకాల ద్వారా మూల ధనాన్ని పెంచుకొని ఆర్‌బీఐ లైసెన్స్‌ రద్దు ప్రమాదం నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తోంది. జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తే సమస్యాత్మక ఆస్తులకు తగ్గట్టు మూలధన వాటా ( క్యాపిటల్‌ రిస్క్‌ వైటెడ్‌ అసెస్ట్స్‌ రేషియో) విధిగా 9శాతం ఆపైన ఉండాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే మార్చి 31 నాటికి అది మరింత పడిపోయో ప్రమాదం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు. ఇలా జరిగితే బ్యాంకు ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. ఐదేళ్ల క్రితమే జిల్లా సహకార కేంద్రబ్యాంకుకు ఆర్‌బీఐ లైసెన్స్‌ ఇచ్చింది.  
 
మూలధనం పెంచుకోవడానికి ప్రతిపాదనలు ఇవీ..
  • ప్రస్తుతం కర్షకజ్యోతి పథకంలో రుణాలు పొందే రైతుల నుంచి 5 శాతం కాలపరిమితి డిపాజిట్, 5 శాతం బీ క్లాస్‌ వాటా మూలధనం సేకరిస్తున్నారు. తాజాగా రుణం మొత్తంలో 10 శాతం పూర్తిగా బీ క్లాస్‌ వాటా మూలధనాన్ని సేకరించాలని నిర్ణయించారు.
  •  కాంపోజిట్‌పథకం కింద తీసుకునే రుణాలలో ప్రస్తుతం 6 శాతం ప్రకారం రూ.1.50 లక్షలకు మించకుండా బీ క్లాస్‌ వాటా మూలధనాన్ని సేకరిస్తున్నారు. తాజాగా రుణ మొత్తంపై 10శాతం బీ క్లాస్‌ వాటా మూలధనం సేకరించాలని డీసీసీబీ నిర్ణయించింది. 
  • దీర్ఘకాలిక( ఎల్‌టీ నాబార్డు)పథకం కింద తీసుకునే రుణాలపై 7.5శాతం లేదా  గరిష్టంగా రూ.20 వేలు (ఇందులో ఏదీ తక్కువైతే ఆ మొత్తం) వాటా ధనంగా సేకరిస్తున్నారు. ఇక నుంచి ఇచ్చే రుణాలలో 7.50 శాతం విధిగా మూల ధనంగా సేకరిస్తారు. ఇలా చేయడం వల్ల కేడీసీసీబీ సమస్యాత్మక ఆస్తులకు తగ్గట్టు మూలధన దామాషా 9 శాతానికి వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.
ప్రతిపాదనలు సాధ్యమేనా?
కేంద్రప్రభుత్వం నవంబరు 8న రూ.500, 1000 నోట్లను రద్దు చేయడంతో అన్ని బ్యాంకులకు ఆర్థిక కష్టాలు పెరిగిపోయాయి. రద్దయిన నోట్ల జిల్లా సహకార కేంద్రబ్యాంకు డిపాజిట్‌లుగా తీసుకోవడాన్ని  ఆర్‌బీఐ మొదటి నాలుగు రోజుల్లోనే బంద్‌ చేసింది. నోట్ల రద్దు కారణంగా ఉత్పన్నం అయిన పరిణామాల్లో ఆప్కాబ్‌ జిల్లా సహకార కేంద్రబ్యాంకు అమలు చేస్తున్న అన్ని రుణ పథకాలను నిలుపుదల చేసింది. ఆప్కాబ్‌ మళ్లీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తర్వాతనే వీటిని అమలు చేయాల్సి ఉంది. రుణ పథకాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో మూలధన వాటాను పెంచుకోవడం ప్రశ్నార్థకమే.
 

Advertisement
Advertisement