చిరస్మరణీయుడు వైఎస్సార్‌ | Sakshi
Sakshi News home page

చిరస్మరణీయుడు వైఎస్సార్‌

Published Thu, Sep 1 2016 11:31 PM

చిరస్మరణీయుడు వైఎస్సార్‌ - Sakshi

 2004–09 మధ్యన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణయుగాన్ని కళ్లెదుట ఆవిష్కరించింది. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వారి పాలిట నిజంగా దేవుడిగా మారిపోయారు. ప్రజాసంక్షేమమే పరమధర్మంగా శ్రమించిన వైఎస్సార్‌ ఎప్పటికీ చిరస్మరణీయుడని ఆయన పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉన్నత చదువులు చదివించిందని, ఇందిరమ్మ పథకంతో సొంతింటి కల నెరవేరిందని ఆ మహనీయుడిని కొనియాడు. తాము బతికున్నంత వరకు ఆయన తమకు దేవుడని చెప్పారు.  నేడు (శుక్రవారం) వైఎస్సార్‌ ఏడో వర్ధంతి సందర్భంగా కొంతమంది నాయకులను ‘సాక్షి’ పలుకరించగా ఆ మహానేతతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారిలో కొందరి అభిప్రాయాలు వారి మాటల్లో...
– మహబూబ్‌నగర్‌ అర్బన్‌/జడ్చర్ల టౌన్‌  
 
పేదల బతుకుల్లో నిజమైన దేవుడు
–షేక్‌ అబ్దుల్‌ సలాం, కావేరమ్మపేట
నేను స్వతహాగా టీడీపీ అభిమానిని. అయితే 2007లో గుండెనొప్పితో బాధపడి కిమ్స్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసుకున్నాను. మాలాంటి పేదల బతుకుల్లో నిజమైన దేవుడు వైఎస్సార్‌. ఆరోగ్యశ్రీ పథకం లేకుంటే నా పరిస్థితి ఏమిటో ఊహించలేను. అందుకే మాలాంటి ఎందరో పేదలకు ఆయన ఇప్పటికీ, ఎప్పటికీ దేవుడే. 
 
 
సొంతింటి కల నెరవేరింది
 –చిట్టమోని పద్మమ్మ, కావేరమ్మపేట
సొంత పక్కాఇంటి కలను  వైఎస్సార్‌ నిజం చేశారు. ఆయన వల్లే పక్కా ఇళ్లు కట్టుకోగలిగాను. ఆ మహానేత ద్వారా ఎంతో మంది పేదలు అనేక రకాలుగా లాభం పొందారు. అందుకే ఇప్పటికీ వైఎస్సార్‌ అంటే మేము మర్చిపోలేదు.
 
 
 వైఎస్‌ వల్లే బీటెక్‌ చేశాను
–  ఆకుల వరుణ్‌కుమార్, జడ్చర్ల
వైఎస్సార్‌ అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్లే ఉన్నత చదువులు చదవగలిగాను. మాది నిరుపేద కుటుంబం. ఉన్నత చదువులు చదివించే స్థోమత ఇంట్లో లేదు. అదే సమయంలో ఆ మహానేత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టడంతో బీటెక్‌  పూర్తిచేసి ఇప్పుడు ప్రైవేట్‌లో ఉద్యోగం చేస్తున్నాను. థ్యాంక్యూ వైఎస్సార్‌. 
 
 
  మహానేతను 15సార్లు కలిశా...
–టీఎస్‌ స్కూల్‌ కరాటే స్పోర్ట్స్‌ అధ్యక్షుడు ఎతినె చెన్నయ్య
2004 నుంచి 2009 వరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని 15సార్లు కలిశాను. చివరిసారి కొంత ఆలస్యమైనందుకు ‘ఏం....మాస్టర్‌! కరాటేను బాగా నేర్పుతున్నావా, లేదా, అంటూ నా పై పంచ్‌ కొట్టి ఉత్సాహపరచిన తీరు నా జీవితంలో మరుపురాని మధుర స్మృతి. సీఎం స్థాయిలో ఉండి కూడా నన్ను గుర్తు పట్టి పలకరించాన్ని చూసి వెంట వచ్చిన 25 మంది షాద్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ సర్పంచులు ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఆయనకు ఫిదా అయ్యారు. పాఠశాలల్లో విద్యార్థినుల రక్షణ కోసం మార్షల్‌ ఆర్ట్స్‌ను పాఠ్యాంశంగా చేర్చాలని తాను చేసిన విజ్ఞప్తికి వెంటనే స్పందించి, వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఆ ఏర్పాట్లు చేయాల్సింది ఉన్నతాధికారులను ఆదేశించారు. కానీ ఆయన ఆకస్మిక మృతితో..ఆ విషయం ముందుకుపోలేదు. 
 
 తమ్ముడూ...అమ్మానాన్నా బాగున్నారా!
–సీజే బెనహర్, మాజీ కౌన్సిలర్‌
1998లో వైస్‌ సీఎల్‌పీ లీడర్‌ ఉన్న సమయంలో జిల్లాలో రైతు భరోసా యాత్రను మూడు రోజులపాటు చేశారు. ఆ సందర్భంగా రాత్రి పూట మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేసేవారు. డీసీసీ మీడియా సెల్‌ కన్వీనర్‌గా నన్ను అప్పటి అధ్యక్షుడు జగీదశ్వర్‌రెడ్డి పరిచయం చేయగా కీపిటప్‌ అంటూ వెన్నుతట్టిన సంఘటను అపురూపం...రెండో రోజు రాత్రి భోజనానికి అప్పటి మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ ఇంట్లో ఏర్పాటు చేయగా, నేను Ðð ళితే బ్రదర్‌ బెనహర్‌ ఇక్కడకు రా అంటూ తన పక్కన కూర్చోపెట్టుకొని అమ్మా,నాన్న బాగున్నారు. ఏం చేస్తారు అంటూ మా కుటుంబ వివరాలు వాకబు చేశారు. నాలాంటి సామాన్య కార్యకర్తను ఆదరించిన తీరు..ఇప్పటికీ నా కళ్లముందు కదలాడుతుంటుంది. అక్కడున్న వారు వైఎస్‌..అంటే వైఎస్‌ అంటూ ప్రశంసించారు.
 
 కంగ్రాట్స్‌  చైర్మన్‌ సాబ్‌...
–మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ముత్యాల ప్రకాశ్‌
2000 సంవత్సరంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అయిన సందర్భంగా సీఎల్‌పీ లీడర్‌గా ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డికి బొకేను అందించి కృతజ్ఞతలు తెలపడానికి వెళ్లాను. ఆఫీస్‌లోకి వెళ్లగానే కంగ్రాట్స్‌ చైర్మన్‌ సాబ్‌ అంటూ పలకరించిన తీరు మరువలేనిది. 2004లో మనమే అధికారంలోకి వస్తాం...జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేసుకుందామని భుజం తట్టి ప్రోత్సహించారు. రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన సందర్భాల్లో కూడా ప్రకాశ్‌ అంటూ పేరు పెట్టి పిలిచిన సంఘటనలు ఇప్పటికీ స్ఫూర్తినిస్తున్నాయి. అలాంటి గొప్ప నేతను ఎల్లప్పుడూ స్మరించుకుంటాం.

Advertisement
Advertisement