అడ్డొస్తే అంతమే.. ఇదీ నయీమ్ రక్తచరిత | Sakshi
Sakshi News home page

అడ్డొస్తే అంతమే.. ఇదీ నయీమ్ రక్తచరిత

Published Tue, Aug 9 2016 4:00 AM

అడ్డొస్తే అంతమే.. ఇదీ నయీమ్ రక్తచరిత - Sakshi

పట్టపగలు నడిరోడ్డుపై అంతా చూస్తుండగా తన అనుచరులతో దారుణ హత్యలు చేయించడంలో నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీమ్ సిద్ధహస్తుడు. ఎక్కువగా వేట కొడవళ్లు, కత్తులతోనే మర్డర్లు చేయించేవాడు. అనుచరులతో నేరాలు చేయించడం, ఆ తర్వాత వారు అరెస్టయ్యే విధానం సైతం పక్కా ప్రణాళికా బద్ధంగా ఉంటాయి. అందుకే ఏ కేసులోనూ పోలీసులు నయీమ్‌కు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించలేకపోయారు. నేరాల్లో పాల్గొనే వారు ఒకరైతే.. 48 గంటల్లోనే పోలీసులకు లొంగిపోయే వారు మరికొందరు ఉంటారు. నయీమ్ నేరచరిత్ర ఇదీ..     - సాక్షి, హైదరాబాద్/నల్లగొండ క్రైం/చౌటుప్పల్
 
ఇదీ నయీమ్ రక్తచరిత
* ఐపీఎస్ వ్యాస్ నుంచి పటోళ్ల దాకా..
* ఎందరినో కిరాతకంగా హతమార్చిన నేరగాడు
* అనుచరులతో కలసి పక్కాగా స్కెచ్.. అదను చూసి వేటు

బెల్లి లలితను ముక్కలుగా చేసి..
తెలంగాణ కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు బెల్లి లలితను 1999 జూన్ 26న నయీమ్ భువనగిరిలో హత్య చేసి శరీర భాగాలను వేట కొడవళ్లతో 18 ముక్కలుగా చేసి జిల్లా అంతటా పడవేయడం సంచలనం సృష్టించింది. భువనగిరిలోని చేతబావి, బస్టాండు, వివిధ ప్రాంతాల్లో లలిత శరీర భాగాలను ముక్కలుగా పడవేశారు.
 
ముగ్గురిని నరికి.. పాతిపెట్టి
బెల్లి లలిత అనుచరులైన ముగ్గురిని నయీమ్ అతి దారుణంగా చంపాడు. ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన ఇక్కిరి సైదులు, సంస్థాన్ నారాయణపురానికి చెందిన బద్దుల మల్లేశ్ యాదవ్, మాదారానికి చెందిన శ్రీరాముల రాములును నయీమ్ హైదరాబాద్‌లో పట్టుకున్నాడు. 2001 డిసెంబర్ 24న చౌటుప్పల్ మండలం మల్కాపురం శివారులో, సబ్‌స్టేషన్ సమీపంలో ఈ ముగ్గురిని ముక్కలు చేశాడు. కాళ్లు, చేతులు, తల, మొండెంలను వేరు చేసి ఒక్కో భాగాన్ని ఒక్కో చోట పాతి పెట్టాడు. ఓ పశువుల కాపరికి  భూమిలోంచి ఓ చేయి కనిపించింది. తవ్వి చూస్తే 6 చేతులు, 6 కాళ్లు బయటపడ్డాయి. మరో 2 చోట్ల తవ్వగా, మొండెం, తల భాగాలు లభ్యమయ్యాయి.
 
పౌర హక్కుల నేత అజాం అలీని..

పౌరహక్కుల సంఘం నేత అజాం అలీని 2001 ఫిబ్రవరి 17న నల్లగొండలోని అంబేడ్కర్ భవన్ ముందు నయీమ్ తన ముఠా సభ్యులతో కలసి హత్య చేశాడు. పౌరహక్కుల సంఘం సమావేశానికి పాల్గొనేందుకు వచ్చిన అజాం అలీని వేట కొడవళ్లతో నరికి చంపారు.
 
సోమ రాధాకృష్ణను వేట కొడవళ్లతో..
నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన సోమ రాధాక ృష్ణ ఎల్బీనగర్ చౌరస్తాలో మిట్టమధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యారు. స్టోన్ క్రషింగ్ యూనిట్ నిర్వహిస్తున్న ఈయన బడా బిల్డర్లకు సరుకు సరఫరా చేసేవారు. ఈయనను బెదిరించి డబ్బు గుంజేందుకు నయీమ్ వేసిన పథకం పారలేదు. దీంతో తన అనుచరులైన షకీల్, జహంగీర్, యాకుబ్, ఇమ్రాన్, జఫార్, హాజీ, రిజ్వీలను రంగంలోకి దింపాడు. వీరంతా కలసి 2010 నవంబర్ 29న రాధాకృష్ణను వేటకొడవళ్లతో దారుణంగా నరికి పరారయ్యారు.
 
బండరాళ్లతో మోది శ్రీధర్‌రెడ్డిని..
నయీమ్ ప్రధాన అనుచరుడిగా పని చేసిన ఉప్పల్ వాసి జహంగీర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీధర్‌రెడ్డి సైతం దారుణంగా హత్యకు గురయ్యాడు. 2011 నవంబర్ 24న నయీమ్ ముఠా శ్రీధర్‌రెడ్డిని కిడ్నాప్ చేసింది. ఈయన్ను పహాడీషరీఫ్ ప్రాంతంలో బండరాళ్లతో మోది దారుణంగా చంపేశారు.
 
ఐపీఎస్ వ్యాస్ హత్యలో..
హైదరాబాద్ నడిబొడ్డున.. అప్పటి పోలీసు కంట్రోల్‌రూమ్ వెనుక ఉన్న ఎల్బీ స్టేడియంలో ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ 1993 జనవరి 27న దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో హైదరాబాద్ రేంజ్ డీఐజీగా పని చేస్తున్న వ్యాస్ పలు జిల్లాల్లో నక్సల్స్ అణచివేతలో సమర్థవంతంగా పని చేయడంతో పాటు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషనల్ విభాగమైన గ్రేహౌండ్స్‌కు ఆద్యుడిగా నిలిచారు. తమ కార్యకలాపాలకు అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో పీపుల్స్ వార్ గ్రూప్ వ్యాస్‌ను టార్గెట్ చేసింది. అప్పటి కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, నిమ్మలూరి భాస్కర్‌రావు నేతృత్వంలో మేకల దామోదర్‌రెడ్డి అలియాస్ మదన్, అప్పారావు, నయీముద్దీన్ సహా మొత్తం 21 మంది రంగంలోకి దిగారు.

ఉదయం 6.30 గంటలకు వాకింగ్ చేస్తున్న వ్యాస్‌పై ఎల్బీ స్టేడియం గేట్ నం.2 నుంచి వచ్చిన యాక్షన్ టీమ్ సభ్యులు మదన్, అప్పారావు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో వ్యాస్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన పక్కనే ఉన్న మరో ఐపీఎస్ దినేశ్‌రెడ్డితో పాటు గన్‌మెన్లు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. ఆ సమయంలో సమీపంలో ఉన్న పోలీసుల దృష్టి మళ్లించడంతో పాటు, కాల్పులు జరిపిన వారు పారిపోవడానికి వీలుగా గేట్ నం.4 వద్ద నయీమ్ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ కేసులో ఇతడు రెండో నిందితుడు.
 
సాంబశివుడి హత్యలో..
బెల్లి లలిత హత్యకు ప్రతీకారంగా నయీం సోదరుడు అలిమొద్దీన్‌ను 1999 డిసెంబర్ 7న భువనగిరిలో కొనపురి రాములు హత్య చేశాడు. దీంతో రాములు, అతడి సోదరుడు కొనపురి ఐలయ్య అలియాస్ సాంబశివుడిపై నయీమ్ పగ పెంచుకున్నాడు. 2011 మార్చి 26న గోకారం గ్రామంలో జరిగిన టీఆర్‌ఎస్ సమావేశంలో పాల్గొని వస్తుండగా నయీమ్ అనుచరులు సాంబశివుడి కారును అడ్డగించి వేట కొడవళ్లతో హత్య చేశారు. ఈ కేసులో నయీమ్ ఏ-1 నిందితుడు. అలాగే సాంబశివుడి సోదరుడు, టీఆర్‌ఎస్ నేత కొనపురి రాములును 2014 నవంబర్ 11న నయీమ్ ముఠా హత్య చేసింది. నల్లగొండలోని మిర్యాలగూడ రోడ్డులో ఓ వివాహ వేడుకకు హాజరైన రాములుపై ఈ ముఠా కాల్పులు జరిపి పరారైంది.
 
గ్రీన్‌టైగర్స్ పేరుతో.. పురుషోత్తం
ఐపీఎస్ వ్యా స్ హత్య కేసులో అరెస్టైన నయీమ్ తన పంథా మార్చుకున్నాడు. తొలుత పీపుల్స్ వార్‌లో చేరిన ఇతడు.. తర్వాత నక్సల్స్‌ను అంతం చేయడమే తన జీవితాశయం అని ప్రకటించాడు. ఈ నేపథ్యం లోనే నక్సల్స్ తరఫున వాణి వినిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం(ఏపీసీఎల్‌సీ) నేత పురుషోత్తంను ‘గ్రీన్‌టైగర్స్’ పేరుతో 2000 నవంబర్ 23న సరూర్‌నగర్ పరిధిలోని మధుపురికాలనీలో పట్టపగలు నడిరోడ్డుపై అనుచరులతో కలసి దారుణంగా హత్య చేశాడు.
 
పటోళ్ల గోవర్ధన్‌రెడ్డిని కత్తులతో నరికి..
ఓ స్థల వివాదంలో విప్లవ దేశభక్త పులులు (ఆర్పీటీ) వ్యవస్థాపకుడు, ఘరానా నేరగాడు పటోళ్ల గోవర్ధన్‌రెడ్డిని నయీమ్ 2011 డిసెంబర్ 27న నడిరోడ్డుపై చంపించాడు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్యకేసులో నిందితుడైన గోవర్ధన్‌రెడ్డి ఆటోలో ప్రయాణిస్తుండగా హైదరాబాద్‌లోని బొగ్గులకుంట వద్ద పట్టపగలు నడిరోడ్డుపై ఐదుగురు వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపారు. పటోళ్ల అనుచరుడైన అనిల్ అలియాస్ అంజయ్యను కోవర్టుగా మార్చుకున్న నయీమ్ ఈ పని చేయించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement