ఏపీ పుష్కరాల్లో అగ్ని ప్రమాదం | Sakshi
Sakshi News home page

ఏపీ పుష్కరాల్లో అగ్ని ప్రమాదం

Published Thu, Jul 23 2015 2:42 AM

ఏపీ పుష్కరాల్లో అగ్ని ప్రమాదం - Sakshi

రాజమండ్రి జగదాంబ హోటల్ లో భారీ పేలుడు
సాక్షి, రాజమండ్రి: గోదావరి పుష్కరక్రతువులో తొలిరోజున జరిగిన తొక్కిసలాటలో 29 మంది బలైన ఘటన మరువక ముందే... తొమ్మిదో రోజైన బుధవారం అదే రాజమండ్రిలో మరో అపశృతి చోటు చేసుకుంది. ఓ హోటల్‌లో సంభవించిన పేలుడుతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు స్వల్పంగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఏడు వాహనాలు మంటల్లో కాలిపోయాయి. అదృష్టవశాత్తు పెను ప్రాణనష్టం తప్పింది.
 
పుష్కరాల తొలిరోజు తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి కూత వేటు దూరంలో.. గోకవరం బస్టాండ్‌కి సమీపంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్‌పై బుధవారం రాత్రి ప్రదర్శితమవుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను వందలాది మంది భక్తులు వీక్షిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి సమీపంలోని శ్రీజగదాంబ హోటల్‌లో రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భయంతో జనం కకావికలవుతుండగా ఎవరో ‘బాంబు పారిపోండి’అంటూ అరవడంతో తొక్కిసలాట జరిగింది.

గుంటూరు జిల్లాకు శారదాంబ అనే 70 ఏళ్ల వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. వందలాది మంది స్వల్పంగా గాయపడ్డా ‘బతుకుజీవుడా’ అంటూ.. తమ సామగ్రిని విడిచి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలిసేలోపే జగదాంబ హోటల్ అగ్నికి ఆహుతైంది. పక్కనే ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌కు మంటలు వ్యాపించి ఓ పాన్‌షాప్‌తో పాటు మరో రెండు షాపులు కాలిపోయాయి. ఆ రెండు దుకాణాల్లో కార్పొరేషన్ శానిటరీ విభానికి చెందిన బ్లీచింగ్ తదితర సామగ్రి నిల్వ ఉండగా అదంతా బుగ్గయ్యింది.

మంటలు  కాంప్లెక్స్ పక్కనే నిలిపి ఉంచిన మినీ బస్సు, మినీ లారీ, జీపు, ఆల్టో కారు, ఆటో, మూడు ద్విచక్ర వాహనాలకు అంటుకుని అవి అగ్నికి ఆహుతయ్యాయి. వాహనాలపై నుంచి వెళుతున్న విద్యుత్ వైర్లు మంటల వేడికి కరిగి, తెగి కిందపడ్డాయి. దీంతో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వ్యాపించిన మంటల్లో జిల్లా పాన్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన గొర్రెల సుబ్రహ్మణ్యం, స్థానికుడైన ప్రేమ్‌కుమార్‌లకు స్వల్పగాయాలయ్యాయి.

సంఘటన జరిగిన ప్రదేశానికి అగ్నిమాపక కేంద్రం కనుచూపు మేరలోనే ఉండటంతో సిబ్బంది క్షణాల్లో ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. 108 వాహనాల్లో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం హోటల్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు కారణమని భావిస్తున్నారు. ఓ సమయంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలుడే కారణమనుకున్నా కాదని తేలింది.
 
బాధితునిపై డీజీపీ దురుసుతనం
డీజీపీ రాముడు సహా పోలీసు ఉన్నతాధికారులంతా సంఘటన స్థలానికి చేరుకుని శాంతి భద్రతలు పర్యవేక్షించారు. ఓ సమయంలో డీజీపీ  అసహనానికి గురై సంఘటన బాధితునిపై మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం, అప్పాపురానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ వైఆర్‌వీ కుమార్ తన ఆల్టో కారు బుగ్గయిందని డీజీపీకి చెప్పుకోవాలని ప్రయత్నించారు. తాను గోదావరి హారతికి వెళ్లి వచ్చేసరికి కారు కాలిపోయిందని చెబుతుండగా డీజీపీ ఆయనను ఏకవచనంతో సంబోధిస్తూ అక్కడి నుంచి వెళ్లిపొమ్మని గద్దించారు.

కుమార్ తనను ఏకవచనంతో పిలవవద్దని, మర్యాద ఇవ్వమన్నారు. దాంతో డీజీపీ ఆయనను లాగిపడేయమని సిబ్బందికి హుకుం జారీ చేశారు. డీజీపీ మొరటు స్పందనతో బిత్తరపోరుున ప్రొఫెసర్ ఇదెక్కడి అన్యాయమంటూ బావురుమన్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ మైకులో హెచ్చరిం చినా అనేకులు పరిసరాల్లో బిక్కుబిక్కుమంటూ ఉండిపోవడంతో అదనపు బలగాలను రప్పించి చెదరగొట్టారు. మీడియాతోనూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అసభ్యపదజాలంతో దూషించి గెంటివేయడంతో నిరసనగా మీడియా సిబ్బంది అక్కడే ఆందోళన చేపట్టారు. హోం మంత్రి చినరాజప్ప, విశాఖ సీపీ అమిత్‌గార్గ్ అనునరుుంచారు.
 
దుర్ఘటనను పెద్దది చేయొద్దన్న చంద్రబాబు
పుష్కరఘాట్‌లో గోదావరి హారతి కార్యక్రమంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాద విషయం తెలియగానే సంఘటన ప్రదేశానికి వచ్చారు. బాధితులను ఆదుకుంటామని, పరిహారం చెల్లిస్తామని, మీడియా అనవసరంగా విషయం పెద్దది చేయొద్దని చెప్పి వెళ్లిపోయారు. అనంతరం హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, సిటీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వచ్చి ప్రమాదం గురించి ఆరా తీశారు.

Advertisement
Advertisement