బంగారు తెలంగాణలో బతుకనీయరా ?

19 Jun, 2016 08:45 IST|Sakshi
బంగారు తెలంగాణలో బతుకనీయరా ?

ముంపు గ్రామాల టీఆర్‌ఎస్ నాయకుల మండిపాటు

 తొగుట : పోరాడి సాధించుకున్న బంగారు తెలంగాణ రాష్ట్రంలో జీవించే హక్కును కాలరాయొద్దని ముంపు గ్రామాల టీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు చేశారు. మండల కేంద్రమైన తొగుటలో శనివారం వారు మాట్లాడుతూ కొమురవెల్లి మల్లన్న సాగర్ నిర్మాణంలో 14 గ్రామాలను ముంచడం దారుణమన్నారు. ప్రభుత్వం మా న్యాయమైన హక్కులపై బూటకపు ఉద్యమాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. రాజకీయ లబ్ధికోసం ఉద్యమాలు చేసి బతుకు పోరాట ఉద్యమాలను కించపర్చొద్దని సూచించారు. రెండు నెలలుగా న్యాయమైన పొరాటం చేస్తున్నా సర్కార్ పట్టించుకోవడంలేదన్నారు.

14 గ్రామాల ముంపు ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. కొందరు రాజకీయ బ్రోకర్లను గ్రామాల్లో ఉసిగొల్పి ప్రజల మధ్యన చిచ్చుపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముంపు గ్రామాల్లో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను ఊరేగించి పోలీస్ స్టేషన్ సమీపంలో దహనంచేశారు. కార్యక్రమంలో ముంపుగ్రామాలైన పల్లేపహడ్, నగరం, తండా, వేముగాట్, తర్క బంజేరుపల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్, తాండ, తిరుమలగిరి, లక్ష్మాపూర్ ,కొంపాక మండలం ఎర్రవెల్లి, శింగారం గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు