ఆక్రమణలో మామిడిగెడ్డ జలాశయం | Sakshi
Sakshi News home page

ఆక్రమణలో మామిడిగెడ్డ జలాశయం

Published Sat, Aug 6 2016 5:17 PM

Mamidigedda occupied by the reservoir

 
మాకవరపాలెం: భూముల ధరలకు రెక్కలురావడంతో ఆక్రమణలు పెచ్చుమీరుతున్నాయి. ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా కబ్జా చేసేస్తున్నారు. అధికారులు కూడా ఈ ఆక్రమణలపై కన్నెత్తి చూడకపోవడంతో ఆక్రమణల సంఖ్య పెగుతూ వస్తోంది. ప్రస్తుతం మామిడిపాలెం రిజర్వాయర్‌ గర్భంలో ఏకంగా రూ.5కోట్ల విలువగల 50ఎకరాల భూమి కభ్జా కోరల్లో చిక్కుకుంది.  తూటిపాల శివారు మామిడిపాలెం వద్ద 1975లో రిజర్వాయర్‌ నిర్మించారు. దీని ద్వారా అడిగర్లపాలెం, రామారాయుడుపాలెం, కె.తూటిపాల, మామిడిపాలెం, పోతలూరు గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ 15 ఏళ్లుగా గర్భం పూడుకుపోయి నిరుపయోగంగా మారింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు దీనిని ఇష్టమొచ్చినట్టు అక్రమించుకుని పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఎకరా ధర రూ.10లక్షలకు పైగా పలుకుతుండటంతో అందరికళ్లూ దీనిపైనే పడ్డాయి. వీటిని తొలగించాలని ఫిర్యాదులు చేసినా అటు ఇరిగేషన్, ఇటు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. 
ఆక్రమణల్లో 50 ఎకరాల గర్భం
సుమారు 100 ఎకరాల గర్భంతో ఉన్న ఈ రిజర్వాయర్‌లో 50ఎకరాలకుపైగా ఆక్రమణకు గురైందని అంచనా. దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు స్పందించకపోవడంతో రోజురోజుకూ ఆక్రమణలు పెరుగుతూ వస్తున్నాయి. ఏడాది క్రితం చుట్టు పక్కల రైతులు వరి సాగు చేపట్టడంతో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై పత్రికల్లోనూ వార్తలు రావడంతో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు రిజర్వాయర్‌ను పరిశీలించి, ఆక్రమణదారుల వివరాలు నమోదు చేసుకున్నారు. కానీ ఇప్పటికీ ఈ ఆక్రమణలు ఇలాగే ఉన్నాయి. ఆక్రమణ భూమిలో సరుగుడు, ఇతర పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ గర్భంలో వరి సాగు చేసేందుకు ఆక్రమణదారులు సన్నద్ధమవుతున్నారు. నాట్లు వేసేందుకు దమ్ములు చేసుకుంటున్నారు. ఈ ఆక్రమణల విషయంపై గత సెప్టెంబర్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో కూడా చర్చకువచ్చింది. వెంటనే ఆక్రమణలను తొలగించాలని తూటిపాల సర్పంచ్‌ జి.ప్రసాదరావు, వైస్‌ ఎంపీపీ వి.వెంకటరమణలు డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
వరిసాగుకు దూరమవుతున్న ఆయకట్టు రైతులు
రిజర్వాయర్‌లోని పూడిక తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ఈ ప్రాంతంలోని రైతులు ఏటా ఖరీఫ్‌లో వరిసాగుకు దూరమవుతున్నారు. ఏకంగా వెయ్యి ఎకరాలకు నీరందక నానా అవస్థలు పడుతున్నారు. తమ ఇబ్బందులను పాలకులుగాని, అధికారులు గాని పట్టించుకోవడం లేదని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదిలేక చాలా మంది రైతులు మెట్ట పంటలను పండించుకుంటున్నారు. దీనిని వినియోగంలోకి తెస్తే ఖరీఫ్‌లోనే కాకుండా ఏటా రెండు పంటలు పండించుకోవచ్చని రైతులు చెబుతున్నారు. 
ఏడాది క్రితమే సర్వేకు లేఖ ఇచ్చాం
రిజర్వాయర్‌ ఆక్రమణలపై సర్వే చేయాలని ఏడాది క్రితమే రెవెన్యూ అధికారులకు లేఖ ఇచ్చాం. కానీ సర్వేకు రాలేదు. నీరు–చెట్టులో రూ.10లక్షలు సిద్దంగా ఉన్నాయి. సర్వే చేసి సరిహద్దులు ఏర్పాటు చేస్తే వీటితో పనులు చేపడతాం. ఇవికాక రిజర్వాయర్‌ అభివృద్ధికి రూ.2.5 కోట్లతో జలక్రాంతి అభియాన్‌లో పంపిన ప్రతిపాదనలు పంపాం. మళ్లీ రెవెన్యూ అధికారులకు సర్వేపై సమాచారం ఇచ్చి ఆక్రమణలు తొగిస్తాం.
                                                 చిన్నమనాయుడు, డీఈ, ఇరిగేషన్‌
                                                      నర్సీపట్నం డివిజన్‌
 
 

Advertisement
Advertisement