పెళ్లికోసం లింగమార్పిడి చేయించుకున్నా.. | Sakshi
Sakshi News home page

పెళ్లికోసం లింగమార్పిడి చేయించుకున్నా..

Published Sat, Oct 29 2016 7:26 PM

పెళ్లికోసం లింగమార్పిడి చేయించుకున్నా..

► ఇద్దరు పురుషుల మధ్య స్నేహం
► మహిళగా ఒకరు లింగమార్పిడి
► ఆమెతో పెళ్లికి నిరాకరించిన స్నేహితుడు
► పోలీస్‌స్టేషన్‌లో ట్రాన్స్‌జెండర్ ఫిర్యాదు


పెనమలూరు : అతని పేరు దుర్గారావు. లింగమార్పిడి ఆపరేషన్ చేసుకుని దుర్గగా మారింది. దుర్గారావుగా ఉన్నప్పుడు ఓ వ్యక్తితో సాన్నిహిత్యం ఏర్పడింది. అతడిని వివాహం చేసుకునేందుకే దుర్గగా మారింది. అయితే ఆ వ్యక్తి దుర్గను కాదని మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు. దుర్గ నిలదీయగా ఆమెతో కలిసి ఉండలేనని, పరిహారంగా రూ.10 లక్షలకు ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు. అనంతరం తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రామిసరీ నోట్లకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో దుర్గ పెనమలూరు పోలీసులను ఆశ్రయించింది.

పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు చెందిన దుర్గారావుకు 2007లో ఇంటర్ చదువుతున్న సమయంలో రాకేష్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. వారు చాలాకాలం కలసి జీవించారు. దుర్గారావు 2010లో ముంబాయ్ వెళ్లి లింగమార్పిడి చేసుకుని దుర్గగా మారింది. రాకేష్‌రెడ్డిని దుర్గ వివాహం చేసుకోవాలనుకుంది. అయితే రాకేష్‌రెడ్డి 2014లో మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఆ సమయంలో రాకేష్‌రెడ్డిని దుర్గ నిలదీయగా అతను పెళ్లి చేసుకోలేనని చెప్పి పరిహారం కింద రూ.10 లక్షలకు ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చాడు. అయితే రాకేష్‌రెడ్డి ఆ తరువాత దుర్గకు కనిపంచకుండా తిరుగుతున్నాడు.

ప్రామిసరీ నోట్లకు కాలం చెల్లిపోతుండటంతో దుర్గ పెనమలూరు మండలం కానూరు టీచర్స్ కాలనీలో నివసిస్తున్న రాకేష్‌రెడ్డి తండ్రి చిరంజీవిరెడ్డి ఇంటికి వచ్చింది. చిరంజీవిరెడ్డి పని చేస్తున్న బ్యాంకు వద్దకు శుక్రవారం వెళ్లి రాకేష్‌రెడ్డి చిరునామా చెప్పాలని గొడవపడింది. దీంతో అతను పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని దుర్గ కూడా పోలీసులను ఆశ్రయించింది. ఈ పరస్పర ఫిర్యాదులతో ఏమి చేయాలో పాలుపోక పోలీసులు తలపట్టుకున్నారు. ఒంగోలులో జరిగిన వ్యవహారానికి తాము ఏమీ చేయలేమని పెనమలూరు పోలీసులు దుర్గకు తెలిపారు. అయితే తనకు న్యాయం చేయాల్సిందేనని దుర్గ పట్టుపట్టింది. చివరకు పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుని బ్యాంకు వద్ద గొడవ చేసినందుకు దుర్గపై, ఆమెను మోసం చేసినందుకు రాకేష్‌రెడ్డిపై కేసులు పెట్టారు. రాకేష్‌రెడ్డి కేసును ఒంగోలుకు బదిలీ చేస్తామని పోలీసులు తెలిపారు.
 

Advertisement
Advertisement