ఖరీఫ్‌ పంటల్లో యాజమాన్యం తప్పనిసరి | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ పంటల్లో యాజమాన్యం తప్పనిసరి

Published Thu, Aug 10 2017 10:50 PM

ఖరీఫ్‌ పంటల్లో యాజమాన్యం తప్పనిసరి - Sakshi

– రెడ్డిపల్లి కేవీకే కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.లక్ష్మిరెడ్డి
అనంతపురం అగ్రికల్చర్‌: వేరుశనగ, కంది, ఆముదం, ప్రత్తి, జొన్న, మొక్కజొన్న తదితర పంటల్లో  సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.లక్ష్మిరెడ్డి తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్‌లో జూన్, జూలైలో ఆయా ప్రాంతాల్లో  సాగు చేసిన పంటలు వివిధ దశలో ఉన్నాయని అన్నారు.   

వ్యవసాయ సూచనలు :
+ జూన్‌ మొదట్లో, ఆ తర్వాత జూలై మొదటి పక్షంలో విత్తుకున్న వేరుశనగ+ కంది, అలాగే ఏకపంటగా కంది, ఆముదం పంటలు ప్రస్తుతం 30 నుంచి 60 రోజుల వయస్సులో ఉన్నాయి. ప్రస్తుతానికి ఎరువులు అవసరం లేదు. పురుగు మందుల పిచికారీ అవసరం లేదు. ఇంకా లక్షల ఎకరాలు పంటలు వేయాల్సి ఉంది. గత రెండు రోజులుగా అక్కడక్కడ మోస్తరుగా వర్షాలు కురిశాయి. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.

+ ఆముదం, కొర్ర, జొన్న పంటలు ఏకపంటగానూ, అంతర పంటలగానూ వేసిన పొలాల్లో ప్రస్తుతం తేమ ఉంటే ఎకరాకు పైపాటుగా 15 కిలోలు యూరియా వేసుకుంటే బాగుంటుంది. నత్రజని వేయడం వల్ల ఏపుగా పెరగడంతో పాటు దిగుబడులు కూడా పెరుగుతాయి.
+ వేరుశనగ, కంది పంటలకు ఎలాంటి ఎరువులు వేయాల్సిన పనిలేదు. పొలంగట్లపై వయ్యారిభామ, వెర్రి ఆవాలు లాంటి కలుపు మొక్కలు నాశనం చేసుకోవాలి. వీటి వల్ల మొవ్వకుళ్లు లాంటి ప్రమాదకరమైన తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కలుపు లేకుండా చూసుకోవాలి.

+ ఆలస్యంగా వర్షం కురిసిన ప్రాంతాల్లో ఎర్రనేలల్లో కొర్ర + కంది లేదా సజ్జ + కంది లేదా జొన్న లాంటి పంటలు వేసుకోవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ పంటలు ద్వారా దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.
+ ఆముదం, కంది పంటలలో ఒత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి. మొక్కల మధ్య కనీసం జానెడు దూరం ఉంటే బెట్టను తట్టుకుంటాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement