ముంపు.. ముప్పు... | Sakshi
Sakshi News home page

ముంపు.. ముప్పు...

Published Mon, Sep 26 2016 6:05 PM

నీట మునిగిన పంటలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

ముంపునకు గురవుతున్న మంజీరా పరీవాహక గ్రామాలు
భారీగా పంటనష్టం.. ప్రజల ఆందోళన
జిల్లాతో సంబంధాలు తెగిన గౌడ్‌గాంజన్‌వాడ గ్రామం
నది తీవ్రత పెరిగితే గ్రామాల్లోకి రానున్న మంజీర బ్యాక్‌వాటర్‌

మనూరు: దశాబ్దకాలంలో ఎన్నడు లేనివిధంగా మంజీరా నది మనూరు మండలంలో తీవ్ర ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఎన్నడు లేనివిధంగా నది పరీవాహక గ్రామాల్లో పంటలు భారీగా మునిగిపోయాయి. నది వెంట ఉన్న ముంపు భూములే కాకుండా కొత్తగా వందలాది ఎకరాల భూముల్లోకి వదర నీరు వచ్చి చేరుతోంది. దీంతో లక్షలు వెచ్చించి సాగుచేసుకున్న పంటలు నీటమునిగాయి.  ప్రభుత్వం రైతులను ఆదుకుంటేనే బతుకుదెరువు ఉంటుందని  రైతులు అంటున్నారు.

అప్పులు తెచ్చి సాగుచేసుకున్న పంటలు పూర్తిగా కళ్లముందే మునిగిపోవడం రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం తక్షణ సాయం అందిస్తేనే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది.  కారముంగి శివారులోనే దాదాపుగా 800ఎకరాలు, గౌడ్‌గాంజన్‌వాడలో 600ఎకరాలు, తోర్నాల్, పుల్‌కూర్తి, గుడూర్‌ బోరంచ, రాయిపల్లి శివారులో 6వేల ఎకరాలకు పైగా పంట మునిగిందని ఆయా గ్రామాల రైతులు అంటున్నారు.

ముంపునకు గురైన గ్రామాలు ఇవే
మంజీరా నీటి మట్టం రోజురోజుకు పెరుగుతుండటంతో మండలంలోని రాయిపల్లి, ధన్వార్, బోరంచ, బెల్లాపూర్, బాదల్‌గాం, పుల్‌కూర్తి, అతిమ్యాల్, తోర్నాల్, గుడూర్, మెర్గి, షాపూర్, కారముంగి, ఔదత్‌పూర్, గోందేగాం, గౌడ్‌గాంజన్‌వాడ తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో సాగులో ఉన్న చెరుకు, మినుము, కంది పంటలు పూర్తిగా మునిగిపోయాయి.

నీటి మట్టం పెరిగితే ప్రమాదమే..
మంజీరలో నీటిమట్టం పెరిగితే పరీవాహక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే గౌడ్‌గాం జన్‌వాడ గ్రామానికి జిల్లాతో సంబంధాలు తెగిపోయాయి, కాగా  బెల్లాపూర్, ముగ్దుంపూర్, బాదల్‌గాం, పుల్‌కూర్తి, తోర్నాల్, ఔదత్‌పూర్‌ గ్రామాల్లోకి మంజీరానీరు వచ్చే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారు. సహాయక చర్యలకు గాను అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.

Advertisement
Advertisement