ఎన్నో తీర్మానాలు.. మరెన్నో చర్చలు... | Sakshi
Sakshi News home page

ఎన్నో తీర్మానాలు.. మరెన్నో చర్చలు...

Published Wed, May 18 2016 10:05 AM

Many resolutions .. More talks ...

* ఆసక్తికరంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
* రాష్ట్రానికి ‘ఎన్‌టీఆర్ నవ్యాంధ్రప్రదేశ్’గా నామకరణం చేయాలని తీర్మానం
* జెడ్పీ పాఠశాలలను గురుకుల పాఠశాలలుగా మార్చేందుకు నిర్ణయం
* నిధులు, విధులు లేని జెడ్పీటీసీ వ్యవస్థను రద్దుచేస్తారా..
* లేకుంటే గౌరవం కల్పిస్తారా చెప్పాలంటూ చర్చ

ఆద్యంతం ఆసక్తికర చర్చలు.. పలు తీర్మానాలు.. వాటిని ప్రభుత్వానికి పంపాలని నిర్ణయూలు... ఇవీ.. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం విశేషాలు. మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డికి నివాళులర్పించడంతో పాటు పలు కీలక అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చించారు. ఆ వివరాలివీ..  - ఒంగోలు
 
రాష్ట్రానికి ‘ఎన్‌టీఆర్ నవ్యాంధ్రప్రదేశ్’గా నామకరణం చేయాలి...
రాష్ట్రానికి ‘ఎన్‌టీఆర్ నవ్యాంధ్రప్రదేశ్’గా నామకరణం చేయాలని జెడ్పీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. జెడ్పీటీసీ సభ్యురాలు నాగజ్యోతి ఈ విషయూన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ తెలుగుజాతి వైభవాన్ని చాటిచెప్పిన ఎన్‌టీఆర్ పేరును రాష్ట్రానికి పెట్టాలని తాము కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు.

కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ ఎన్‌టీఆర్ పేరుతో అనేక పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి కూడా తప్పకుండా ఆయన పేరు పెట్టాలని పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు మాట్లాడుతూ పథకాలకు పేరుపెడితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆ పేరు మారుతుంటుందని, అదే రాష్ట్రానికి పెడితే చిరస్థాయిగా ఉండిపోతుందని అన్నారు.

మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ఎన్‌టీఆర్ పేరు పెట్టేందుకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే, ఎన్‌టీఆర్ పేరుకన్నా చంద్రన్న పేరునే పథకాలకు ఎక్కువగా పెట్టారని, ఈ నేపథ్యంలో ఎన్‌టీఆర్ పేరు పెట్టేందుకు చంద్రబాబు ఎంతవరకు ముందుకు వస్తారనేది తమకు అనుమానంగా ఉందని పేర్కొన్నారు. అందువల్ల ఈ ప్రతిపాదనను చంద్రబాబు ద్వారానే కేంద్రానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రాష్ట్రానికి ఎన్‌టీఆర్ నవ్యాంధ్రాప్రదేశ్‌గా పేరుపెట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది.
 
జెడ్పీ పాఠశాలలను జెడ్పీ గురుకుల పాఠశాలలుగా మార్చాలి...
జిల్లాలో జెడ్పీ ఉన్నత పాఠశాలలు 380 ఉన్నాయని, వాటిలో 90 శాతం మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీలేనని చైర్మన్ ఈదర హరిబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల ఒక ప్రాంతంలో, హాస్టళ్లు మరో ప్రాంతంలో ఉండటం వల్ల ప్రభుత్వానికి, విద్యార్థులకు భారంగా మారుతుందన్నారు.

చాలాచోట్ల సరిపడినంత స్థలం కూడా లేకపోవడంతో హాస్టళ్ల నిర్మాణాలకు కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. తాము ప్రతిపాదించే విధానాల ప్రకారం ప్రతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేవలం ఐదారు చుట్టుపక్కల గ్రామాలకు కేంద్రంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఆ పాఠశాల ఆవరణలోనే హాస్టళ్ల నిర్మాణం కూడా చేపడితే ఆ గ్రామాల్లోని విద్యార్థులు డేస్కాలర్లుగా, ఇతర గ్రామాల విద్యార్థులు రెసిడెన్షియల్‌గా ఉంటారన్నారు.

కేవలం 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే తమ గ్రామాలుండటం వల్ల విద్యార్థులు సెలవురోజుల్లో ఇంటికి వెళ్లడానికి వీలవుతుందన్నారు. ఇందుకోసం జెడ్పీ పాఠశాలలను జెడ్పీ గురుకుల పాఠశాలలుగా మార్చాలన్నారు. దీనిపై కూడా సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణరుుంచింది.
 
డీసీసీబీని ఆర్‌సీఎస్ టార్గెట్ చేస్తోంది : ఈదర మోహన్
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకును నిర్వీర్యం చేయాలనే కక్షతో రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ (ఆర్‌సీఎస్) వ్యవహరిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ అనుమతితో పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్‌బాబు సభలో ప్రస్తావించారు.
 
సొసైటీలకు సంబంధించిన మిగులు షేరు ధనాన్ని వెంటనే సొసైటీలకు జమచేయాలని ఆదేశించారని, దీన్ని కేవలం బ్యాంకుకు మాత్రమే రాతపూర్వకంగా పంపారని పేర్కొన్నారు. ఇటీవల కరువు కాలంలో రైతులకు సత్వరంగా రుణాలందించేందుకు మూలధనం లేకుండా కూడా రుణాలు మంజూరుచేశామన్నారు. అయితే, ఆప్కాబ్ ఆదేశాలతో రైతుల వద్దనుంచి తిరిగి 3 శాతం మూలధనాన్ని వసూలు చేశామన్నారు. కానీ, తాజాగా ఆర్‌సీఎస్ నుంచి వచ్చిన ఆదేశాలతో బ్యాంకుపై రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. కక్షపూరితంగా వ్యవహరిస్తూ బ్యాంకును దెబ్బతీయాలని చూస్తున్న ఆర్‌సీఎస్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని మోహన్‌బాబు కోరారు. ఆ మేరకు సమావేశం కూడా తీర్మానించింది.
 
జెడ్పీటీసీ వ్యవస్థను రద్దుచేయండి...
జెడ్పీటీసీ సభ్యులైన తాము కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారామని, ఇటువంటి వ్యవస్థ అవసరం లేదనుకుంటే రద్దుచేసి ప్రభుత్వం వ్యయాన్ని తగ్గించుకోవచ్చని పొదిలి జెడ్పీటీసీ సభ్యుడు సాయిరాజేశ్వరరావు సభలో చర్చలేపారు. పంచాయతీ సర్పంచ్ అనుమతి లేకుండా గ్రామంలో ఏమీ చేయలేకపోతున్నామన్నారు.

జెడ్పీ నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నా.. ఆ వివరాలు కూడా తమకు తెలియడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు తాము కూర్చునేందుకు ఎంపీడీవో కార్యాలయంలో కుర్చీ కూడా ఉండటం లేదన్నారు. దీనిపై పలువురు జెడ్పీటీసీ సభ్యులు స్పందిస్తూ ఎంపీపీల ద్వారానే జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బెటరని, జెడ్పీటీసీ వ్యవస్థను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ సభ్యులకు ఏడాదికి కనీసం రూ.10 లక్షల జెడ్పీ నిధులు కేటాయించాలన్నారు. వ్యవస్థను రద్దుచేయడంగానీ, విధులు, నిధులు కల్పించడంగానీ చేయూలని తీర్మానిస్తూ ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు.
 
‘ఏసీ’కి నోటీసులు, విచారణకు కమిటీ...
పర్చూరు మండలంలో దేవాలయ భూములకు సంబంధించిన కుంభకోణంపై సమాధానం ఇవ్వాలని దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ను జెడ్పీ చైర్మన్ అడిగారు. అయితే, కమిషనర్‌కు బదులుగా సమావేశానికి సూపరింటెండెంట్ రావడంపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ ఎందుకు రాలేదని ప్రశ్నించగా, క్యాంపునకు వెళ్లారని సూపరింటెండెంట్  బదులిచ్చారు. క్యాంపు ఎక్కడ అని ప్రశ్నిస్తే.. తనకు తెలియదంటూ సూపరింటెండెంట్ నీళ్లు నమలడంపై చైర్మన్ మండిపడ్డారు. కుంభకోణంపై విచారణకు జెడ్పీ నుంచి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
 
పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి...
 జిల్లా పరిషత్ పాఠశాలలు, వాటిలో ఆటస్థలాలను అభివృద్ధి  చేసేందుకు సమావేశంలో ప్రతిపాదించి తీర్మానించారు. సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా భూతాపాన్ని పెంచడం కంటే నీరు-చెట్టు పథకం, ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డ్వామా పీడీ పోలప్ప పేర్కొన్నారు. రోటరీ క్లబ్ చిలకలూరిపేట ప్రధాన కార్యదర్శి రత్నప్రభాకర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా పరిషత్ స్కూళ్లలో 14 వేల బెంచీలు, 190 ఆర్‌వో ప్లాంట్లు, 660 మరుగుదొడ్లు, 100 లైబ్రరీలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే మూడు నెలల్లో జిల్లాలోని జెడ్పీ పాఠశాలలకు 3,800 బెంచీలు అందజేస్తామని పేర్కొన్నారు.
 
ఆర్‌అండ్‌బీలో అక్రమాలపై విచారణకు ఆదేశం
జిల్లాలోని రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ)లో అక్రమాలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు ప్రకటించారు. అందుకోసం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు. జిల్లాలో రూ.100 కోట్ల పనులకు సంబంధించి అక్రమాలు జరిగాయంటూ సాక్షి దినపత్రికలో ఆధారాలతో సహా కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై ఆర్‌అండ్‌బీ అధికారులను ఈదర ప్రశ్నించారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సమావేశానికి ఎందుకు రాలేదని, టెండర్లు పిలిచినా ఎందుకు ఓపెన్ చేయలేదని, ఎమ్మెల్యేలు తెరవవద్దంటే టెండర్ కవర్లు ఓపెన్ చేయరా..? అని ప్రశ్నించారు.

గత నెల 22వ తేదీ టెండర్లు తెరిచామంటూ ఆర్‌అండ్‌బీ అధికారులు సమావేశంలో ప్రకటించారు. మరి ఎందుకు బయటపెట్టలేదని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగిల్ టెండర్ వేస్తే ఓపెన్ చేస్తారా..? ముగ్గురునలుగురు కలిసి ఒక పనికి టెండర్ వేస్తే ఓపెన్ చేయరా..? అంటే కాంట్రాక్టర్లు సిండికేట్ కావడానికి మీరే సహకరిస్తున్నారా..? అంటూ జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.

Advertisement
Advertisement