మావోయిస్టుల ముసుగులో మహిళా సంఘాలు | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల ముసుగులో మహిళా సంఘాలు

Published Sun, Feb 5 2017 11:23 PM

మావోయిస్టుల ముసుగులో మహిళా సంఘాలు - Sakshi

గిరిజన యువతను మావోయిస్టుల్లో చేర్పించడమే వాటి పని
కొయ్యూరులో వెలసిన కరపత్రాలు


కొయ్యూరు(పాడేరు) : మొదటిసారిగా మహిళా సం ఘాలపై తీవ్ర ఆరోపణలతో కరపత్రాలు వెలువడ్డాయి. స్థానిక మండల పరిషత్‌ ఆవరణలోని గోడపై ఈ కరపత్రం వెలుగుచూసింది. వాటిని ఎవరు అంటించారో తెలియకపోయినా విద్యార్థిని చైతన్య సంఘం పేరిట అంటించారు. మహిళా సంఘాలు కొన్ని మావోయిస్టుల ముసుగులో పనిచేస్తున్నాయని, దీనిని గిరిజన విద్యార్థులు గుర్తించాలని పేర్కొన్నారు. కళాశాల లేదా హాస్టళ్లకు చైతన్య మహిళా సంఘం, ప్రగతి శీల మహిళా సమాఖ్య తరఫున కార్యక్రమాలు చేసేందుకు బృందాలు గా వస్తారని, స్త్రీశక్తి, లేదా మహిళా చైతన్యం అంటూ మాయమాటలు చెబుతారని పేర్కొన్నా రు. ‘మీతో పాటు పాడించి వారి వెంట తిప్పు కుంటారు. సమాజంలో ఉండాల్సిన మిమ్మల్ని అడవిబాట పట్టిస్తారు.. వారి మాటల  ఒరవడి, పాటల పల్లవిలో మీరంతా శ్రుతులు మాదిరిగా కలిసిపోయేలా చేస్తార’ని పేర్కొన్నారు. అమాయకంగా ఉండే పేద విద్యార్థులను ఎన్నుకుని వారికి పాఠాలు చెబుతారని, పరీక్షలు పెడతారని, తరువాత బహుమతులు ఇస్తారని ఆరోపించారు. ఇదంతా చైతన్యమని దానిని అందుకోడానికి అరుణతార మహిళా మార్గం లాంటి పుస్తకాలను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.

మీ తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడి పిల్లలకు భరోసా ఇస్తామని చెబుతారని, అయితే ఈ సంస్థలన్నీ కూడా మావోయిస్టు ముసుగు సంఘాలని, మిమ్మల్ని చదువు మాన్పించి అడవుల్లో తిప్పుకోవడమే వారి లక్ష్యమని తీవ్ర ఆరోపణలు చేశారు. వారి మాటలు, పాటలు కూడా విషపూరితాలని, వారి బోధన మార్గం నయవంచనేనని, తేనె పలుకులు కురిపించే చేతనలు.. పాలిచ్చే నెపంతో విషమిచ్చే పూతనలు అంటూ ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు. పోస్టర్లపై సత్రజ్, దేవేంద్ర, రాజేశ్వరి, వరలక్ష్మి, శిల్ప పద్మ, సిపోరా, అన్నపూర్ణ, ఇందూ, రాధ అని పేర్కొంటూ ఫొటోలను సైతం ముద్రించారు.  

Advertisement
Advertisement