దూరవిద్య పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ | Sakshi
Sakshi News home page

దూరవిద్య పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌

Published Mon, Jun 5 2017 10:34 PM

దూరవిద్య పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌

– ఎస్కే దూర విద్య పరీక్షలు ప్రారంభం
– సెంటర్‌ రద్దు అయినా మారని నిర్వాహకుల తీరు
– పరీక్షల పేరుతో విద్యార్థుల నుంచి వసూళ్లు 
– చీటిలు పెట్టి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు
– పత్తాలేని పర్యవేక్షణ అధికారి? 
 
కర్నూలు సిటీ: శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ దూర విద్య పరీక్షల్లో జోరుగా మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోంది. సోమవారం నుంచి ఎస్కే దూర విద్య డిగ్రీ పరీక్షలు నగరంలోని గాయత్రి ఎస్టేట్‌లో ఉన్న ఓ కాలేజీలో పరీక్షలు నిర్వహించారు. యూనివర్సిటీ అధికారి పరీక్ష కేందంలో ఉండి పర్యవేక్షించాల్సి ఉన్నా పరీక్ష మొదలు అయ్యే సమయంలో మాత్రమే ఉండి మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దూర విద్య కేంద్రాల నిర్వాహకులు.. కొందరు విద్యార్థులకు చీటిలు ఇవ్వగా, మరి కొందరు విద్యార్థులు పాత పుస్తకాలు చింపుకొని వెంట తెచ్చుకున్నట్లు  సమాచారం. ప్రైవేట్‌, ప్రభుత్వ ఉద్యోగులు, పదోన్నతుల కోసం, గృహిణులు, నిరుద్యోగులు విద్యార్హత కోసమే అధిక శాతం దూర విద్య ద్వారా డిగ్రీ చదువుతున్నారు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకొని నిర్వాహకులు విద్యార్థుల నుంచి రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేసినట్లు తెలిసింది.
 
దూర విద్య కేంద్రాల ద్వారా చదువుతున్న వారి నుంచి యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించి, సకాలంలో మెటీరియల్‌ అందజేయాల్సి ఉంది. అయితే  యూనివర్సిటీ అధికారులు రెండేళ్లుగా పుస్తకాలను సరఫరా చేయకపోవడంతో నిర్వాహకులకు కలిసి వస్తోంది. దీన్నో అవకాశంగా తీసుకొని పరీక్షలను చూచి రాయిస్తామని విద్యార్థుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. చూచిరాతలు జరుగుతుండడంతో గతంలో సెంటర్‌గా ఉన్న కాలేజీని రద్దు చేశారు. అయినా నిర్వాహకుల తీరు మారకపోవడం గమనార్హం.
 
చిట్టీలు పెట్టి పరీక్షలు!
శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ దూర విద్య పరీక్షల్లో ఏడాదికేడాది చూచిరాతల జోరు పెరుగుతున్నా నియంత్రించ లేకపోతున్నారు. సాధారణంగా దూర విద్య అంటే సెలవు రోజుల్లో క్లాస్‌లు నిర్వహించి, రికార్డులు, సైన్స్‌ విద్యార్థులకు ల్యాబ్‌లో ప్రాక్టికల్‌ చేయించాలి. పరీక్షలకు నాలుగు నెలల ముందుగానే కోర్సు మెటీరియల్‌ ఇవ్వాలి. రెండేళ్లుగా యూనివర్సిటీ అధికారులు ఆదాయంపై ఉన్న ధ్యాస విద్యార్థులకు ఇవ్వాల్సిన మెటీరియల్, క్లాస్‌లు, ల్యాబ్‌పై పెట్టక పోవడం కూడా మాస్‌ కాపీయింగ్‌కు కారణమనే విమర్శలున్నాయి.
 
ఒకరు తరువాత..
ఇన్విజిలేటర్‌ సోమవారం ప్రశ్నపత్రం ఇచ్చాక విద్యార్థులు సమాధానాలు చిటీలను చూసి ఒకరు తరువాత ఒకరు రాశారు. పరీక్షల పర్యవేక్షణకు మాత్రం యూనివర్సిటీ నుంచి వచ్చే వారిని నిర్వాహకులు ముందుగానే తమకు అనుకూలమైన వారిని డ్యూటీలో వేయించుకున్నట్లు సమాచారం. అందుకు వచ్చిన అధికారి కాసేపు ఉండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన డిగ్రీ, పీజీ దూర విద్య పరీక్షల్లో కాపీయింగ్‌ జరిగినట్లు యూనివర్సిటీ అధికారుల విచారణలో తెలడంతో సెంటర్‌ను రద్దు చేశారు. అయితే గాయత్రి ఎస్టేట్‌లోని కాలేజీలో పరీక్షలను నిర్వహించేందుకు మరో వ్యక్తి సెంటర్‌కు అనుమతి ఇవ్వడంతో అక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాలేజీలోకి ఎవరూ రాకుండా గేట్లు వేసి, మూడు, నాల్గో ఫ్లోర్‌లో పరీక్షలు నిర్వహించారు. 
 

Advertisement
Advertisement