మట్కా ఓపెన్‌..బతుకులు క్లోజ్‌ | Sakshi
Sakshi News home page

మట్కా ఓపెన్‌..బతుకులు క్లోజ్‌

Published Thu, Jul 28 2016 12:22 AM

మట్కా ఓపెన్‌..బతుకులు క్లోజ్‌ - Sakshi

పోలీస్‌స్టేషన్‌ మామూళ్లు నెలకు రూ.50వేలు..
కానిస్టేబులే మట్కాకు బానిసైన వైనం
జూదం పేరుతో రోజూ రూ.3 లక్షలు  వసూలు చేస్తున్న బీటర్లు
కోడుమూరులో కర్నూలు మట్కాకింగ్‌ బంధువులదే కీలకం!

మట్కా నెంబర్‌ తగిలితే రూ. 1కి రూ.80 ఇస్తాం. ఇది కోడుమూరు మండలంలో మట్కాబీటర్ల ఆఫర్‌. కోడుమూరు మండలంలో విచ్చలవిడిగా  సాగుతున్న ఈ ఆటకు అమాయక జనం బానిసై ఆర్థికంగా చితికిపోతున్నారు. మరికొందరు ఆస్తులు పోగొట్టుకొని రోడ్డున పడుతున్నారు. ఈ మాయజూదానికి అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు నెలమాముళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

కోడుమూరు:కోడుమూరు పట్టణంలోని నాయీ బ్రాహ్మణ వర్గానికి చెందిన ఓ యువకుడు మట్కాకు  బానిసై రూ.4లక్షలు అప్పులు చేసి భార్యాపిల్లలను వదిలేసి ఊరు వదిలి పారిపోయాడు. తల్లిదండ్రులు అప్పులు కట్టి మళ్లీ పునరావాసం కల్పించారు. లద్దగిరిలో ఓ వ్యక్తి మట్కాకు బానిసై బస్టాండ్‌ ప్రాంతంలో ఉన్న ఇల్లు, ఆటో అమ్ముకొని బాడుగ ఇంట్లో నివాసముంటున్నాడు. ఇలా ఎంతోమంది మట్కాకు బానిసై అస్తులు పొగొట్టుకుంటున్నారు.  మండలంలో వీధి వీధిన మట్కాబీటర్లు తిష్టవేసి ప్రజలకు డబ్బుఆశచూపి మాయజూదంలోకి లాగుతున్నారు. మట్కా నంబర్‌ తగిలితే రూపాయకు రూ.80లు ఇస్తామని మభ్యపెట్టి వారి నుంచి వేలకువేలు వసూలు చేస్తున్నారు. ఓపెన్, క్లోజింగ్‌ నంబర్ల పేరుతో వారంలో ఐదు రోజులు ఈ దందా సాగిస్తున్నారు. మండలంలో రోజుకు దాదాపు రూ.3లక్షలు వసూలవుతున్నట్లు సమాచారం.
 మట్కా బీటర్లు వీరే:
కర్నూలు నగరంలో మట్కా కింగ్‌గా రాజ్యమేలుతున్న మట్కా బీటర్‌ సమీప బంధువులు కోడుమూరు పట్టణంలో పెద్ద ఎత్తున  జూదం నడుపుతున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం పోలీస్‌స్టేషన్‌కు కూడా పిలిపించరు. అత్యాధునికమైన నాలుగు భవంతులను ఆ మట్కా బీటర్‌ కోడుమూరులో నిర్మించాడు. గోరంట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కర్నూలు రేడియోస్టేషన్‌ దగ్గర మెడికల్‌షాపు వ్యాపారం ముసుగులో మట్కాను నడుపుతున్నాడు. కోడుమూరు, గోరంట్లలో మట్కా బీటర్లను ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడు. అల్లినగరంలో ఓ వ్యక్తి మట్కా బీటర్‌ అవతారమెత్తి రోజుకు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాడు. గతంలో కోడుమూరు పోలీస్‌స్టేషన్‌లో ఆ వ్యక్తిపై మట్కా కేసులు నమోదయ్యాయి.
మట్కా నంబర్‌ తగిలినా మోసమే :
మట్కా నంబర్‌ తగిలిన రోజు జూదరికి డబ్బులివ్వకుండా బీటర్లు మోసం చేస్తున్నారు. మట్కా నంబర్‌ తగిలిన రోజు పోలీసుల దాడులు జరిగాయని బుకాయించి తప్పించుకుంటున్నారు. పోలీసుల నిఘా ఎక్కువగా ఉండడంతో డబ్బులు ప్రధాన మట్కా కేంద్రానికి పంపలేదని జూదరులను బెదిరిస్తున్నారు. ఇలా రెండు విధాలుగా మట్కా జూదరులు నష్టపోతున్నారు.  బీటర్లు మాత్రం అస్తులు కూడబెట్టుకుంటున్నారు.
మట్కాకు పోలీసుల అండ
 మట్కాపై ఫిర్యాదులొచ్చినా చిన్నా చితక మట్కా ఆడే వారిని పట్టుకొచ్చి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పెద్ద ఎత్తున మట్కా నడిపేవారికి పోలీసులు రక్షణ కవచంగా నిలుస్తున్నారు. లద్దగిరి గ్రామంలో 5మంది యువకులకు రూ.12 లక్షలు మట్కా తగిలిన విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే వారందరిని పోలీస్‌ కస్టడీలో వారం రోజుల పాటు పెట్టుకొని వారి నుంచి  రూ.5లక్షలు వసూలు చేసుకుని కేసు లేకుండా వదిలిపెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోడుమూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ మట్కా జూదానికి బానిసయ్యాడు. ఇద్దరు మధ్యవర్తుల ద్వారా రోజు వందలాది రూపాయలు మట్కా బీటర్లకు జూదం కోసం పంపుతున్నట్లు సమాచారం.
మట్కాపై నిఘా పెట్టాము : మహేష్‌కుమార్, ఎస్‌ఐ
మట్కాబీటర్లపై నిఘా పెట్టాము. 6నెలల క్రితం మట్కాపై ఒకటో రెండో కేసులు పెట్టాము. కర్నూలు ప్రధాన మట్కా బీటర్‌ బంధువులపై నిఘా ఉంచాం. ఆధారాలు దొరికితే అరెస్ట్‌ చేస్తాం. మట్కాను ప్రోత్సహించే వారిని వదిలే సమస్యే లేదు.

 

Advertisement
Advertisement