మన్యంలో కలవరం

18 Aug, 2016 01:21 IST|Sakshi
మన్యంలో కలవరం
టార్గెట్‌ ఇన్‌ఫార్మర్‌ ∙
చింతూరు: పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా భావిస్తున్న కొందరిని మావోయిస్టులు కిడ్నాప్‌ చేయడంతో మన్యంలో కలవరం నెలకొంది. చింతూరు మండలం పేగ గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులను మావోయిస్టులు మంగళవారం రాత్రి కిడ్నాప్‌ చేశారు. చింతూరు మండలంలో పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడంటూ గతనెల 29వ తేదీన లచ్చిగూడెం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్‌ ఉయికా మారయ్యను మావోయిస్టులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఘటనాస్థలంలో మావోయిస్టులు ఓ లేఖను వదిలారు. చింతూరు మండలంలోని పేగ, వినాయకపురం, అల్లిగూడెం గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులు పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, వారు తమతీరు మార్చుకోకుంటే కన్నయ్యకు పట్టిన గతే పడుతుందని  ఆ లేఖలో హెచ్చరించారు.  ఆ లేఖలో ప్రస్తుతం కిడ్నాప్‌కు గురైన వారి పేర్లు కూడా ఉండడంతో లేఖలో పేర్లున్న మిగిలినవారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన వారిని ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తమవారిని క్షేమంగా విడిచిపెట్టాలని మావోయిస్టులను బాధిత కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న శబరి ఏరియా కమిటీ ఆధ్వర్యంలోనే ఈ కిడ్నాప్‌ జరిగినట్టు తెలుస్తోంది. కిడ్నాప్‌ నేపధ్యంలో ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేసే అవకాశం ఉంది. దాంతో మరోమారు మన్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు