మెకానిక్‌ కూతురు ఎస్‌ఐ | Sakshi
Sakshi News home page

మెకానిక్‌ కూతురు ఎస్‌ఐ

Published Sat, Mar 25 2017 11:40 PM

మెకానిక్‌ కూతురు ఎస్‌ఐ - Sakshi

కర్నూలు (సిటీ): కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని ఓ మెకానిక్‌ కుమార్తె నిరూపించారు. కల్లూరు ఎస్టేట్‌లోని భగవాన్‌ నగర్‌కు చెందిన దాసరి దాసప్ప, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె లలిత ఇటీవల పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించిన సబ్‌ఇన్స్‌పెక్టర్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఎస్‌ఐ ఉద్యోగాన్ని సాధించారు. ఈ దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు. దాసప్ప కార్ల మెకానిక్‌ షెడ్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. రెండో కుమార్తె జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. మూడో కుమార్తె లలిత సబ్‌ఇన్స్‌పెక్టర్‌గా ఎంపికయ్యారు.
 
ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు కల్లూరు ఎస్టేట్‌లోని శ్రీశాంతి నికేతన్‌ స్కూలులో, ఇంటర్‌ టౌన్‌ మోడల్‌ జూనియర్‌ కళాశాల, డిగ్రీ కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో చదివారు. అనంతరం పీజీ బయో కెమిస్ట్రీ ఎస్వీ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సుదూర ప్రాంతాలకు వెళ్లి కోచింగ్‌ తీసుకోలేకపోయారు. లలిత ఇబ్బందులను గుర్తించి కర్నూలు నగరంలోని వివేక్‌ అకాడమీ కోచింగ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు ఉచితంగా కోచింగ్‌ అందించారు. ఇటీవల నిర్వహించిన పోలీసు శాఖ నిర్వహించిన పరీక్షల్లో 206 మార్కులతో (హాల్‌ టిక్కెట్‌ నెంబర్‌ 5095999) సులువుగా విజయం సాధించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో నాలుగో జోన్‌ పరిధిలో మొత్తం 39 మంది ఎంపికయ్యారు. వీరిలో 16 మంది కర్నూలు జిల్లాకు చెందినవారు ఉండటం, వారిలోను పది మంది మహిళలు ఉండటం గమనార్హం.  
 
చాలా ఆనందంగా ఉంది: లలిత
మా నాన్న మా కోసం పడుతున్న కష్టాన్ని చూసి పట్టుదలతో చదివాను. 2015 నుంచి వివేక్‌ అకాడమీ డైరెక్టర్‌ సలహా మేరకు గ్రూప్‌–2 శిక్షణ తీసుకున్నాను. ఉచితంగానే శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా సలహాలు, సూచనలు ఇవ్వడంతో ఉద్యోగ సాధనకు ఎంతో ఉపయోగపడింది. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టును మొదటి ప్రయత్నంలోనే సాధించడం చాలా ఆనందంగా ఉంది.
 

Advertisement
Advertisement