‘భూ సంజీవని’గా జిల్లా | Sakshi
Sakshi News home page

‘భూ సంజీవని’గా జిల్లా

Published Sat, Aug 6 2016 10:20 PM

కౌడిపల్లిలో రైతులకు ఇన్‌పుట్స్‌ అందచేస్తున్న ఏఓ

  • 50 మంది రైతులతో 50 ఎకరాల్లో సేంద్రియ సేద్యం
  • కౌడిపల్లి: సేంద్రియ వ్యవసాయంతో అటు రైతులకు, ఇటు ప్రజానీకానికి ఎంతో మేలు కలుగుతుందని కౌడిపల్లి వ్యవసాయ అధికారి ఎర్ర రాజు తెలిపారు. శనివారం మండలంలో ‘భూ సంజీవని’ పథకం కింద ఎంపిక చేసిన రైతులకు ఇన్‌పుట్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మెదక్‌ జిల్లాను భూ సంజీవని పథకం కింద ఎంపిక చేసిందన్నారు.

    ఈ పథకంలో భాగంగా మండలానికి 50 మంది రైతులను ఎంపిక చేసి వారి చేత 50 ఎకరాల మేరకు వరి, కంది, మినుము పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేయించనున్నట్లు తెలిపారు. దీనికోసం ఎంపిక చేసిన లబ్ధిదారులకు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు వీలుగా నీమకేక్‌, నీమ్‌ ఆయిల్‌,  వర్మి కంపోస్టు ఎరువులను సబ్సిడీపై ఇవ్వడంతో పాటు జీవ ఎరువులు సుడోమోనస్‌, ట్రైకోడర్మ, పీఎస్‌బీని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

    రైతులు రసాయన ఎరువులు విచ్చలవిడిగా వాడటంతో భూసారం తగ్గడంతోపాటు ఆహార పదార్థాలు కలుషితం అవుతున్నాయన్నారు. దీంతో పూర్వం పంటలు పండించినట్లుగా సేంద్రియ వ్యవసాయం చేసే విధంగా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులను వాడాలని సూచించారు.

    సేంద్రియ ఎరువులైన వర్మి కంపోస్టు, వర్మివాష్‌, జీవామృతం, పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువు, జీవ ఎరువులను వాడటం వల్ల భూసారం పెరగడంతోపాటు ఆహార పదార్థాలు నాణ్యతగా, ఆరోగ్యకరంగా ఉంటాయన్నారు. రైతులకు సైతం తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇన్‌పుట్స్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రేంరాజ్‌ రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement