ఆంధ్రప్రదేశ్‌లో మద్యం తుపాన్ | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం తుపాన్

Published Fri, Oct 7 2016 2:13 AM

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం తుపాన్ - Sakshi

* ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కర్ మండిపాటు
* చంద్రబాబు హయాంలో గణనీయంగా పెరిగిన మద్యం వినియోగం
* రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు ప్రజలను మోసగించారు
* స్విస్ చాలెంజ్ పేరుతో భారీ అవినీతికి తెరతీశారు
* కేంద్రం సహకారంతోనే అరాచకాలకు పాల్పడుతున్నారు

సాక్షి, అమరావతి: అప్పట్లో అతిపెద్ద తుపాన్ వల్ల దివిసీమ ఉప్పెన సంభవిస్తే.. మళ్లీ ఇప్పుడు మద్యం తుపాన్ రాష్ట్రాన్ని చుట్టుముట్టిందని ప్రముఖ సామాజికవేత్త మేధాపాట్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. మద్య రహిత దేశం కోసం ఉద్యమిస్తేనే స్వచ్ఛభారత్ రూపుదిద్దుకుంటుందని అభిప్రాయపడ్డారు.

మత్తు లేని దేశం కోసం ప్రతి ఒక్కరూ ప్రతినబూనాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మద్యపానానికి వ్యతిరేకంగా గాంధీ జయంతి రోజున కన్యాకుమారి నుంచి మద్య విముక్త భారత్ కోసం మేధా పాట్కర్ ఆందోళన యాత్ర చేపట్టారు. ఆమె గురువారం విజయవాడలో ‘సంగమం’ (లౌకిక ప్రజాస్వామ్యవాదుల, సంస్థల సమైక్య వేదిక) ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మేధా పాట్కర్ ప్రసంగిస్తూ...  చంద్రబాబు నాయుడు 1997లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో మద్య నిషేధాన్ని ఎత్తేశారని గుర్తుచేశారు.

చంద్రబాబు హయాం నుంచే ఏపీలో మద్యం వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. తమిళనాడులో మద్యం ఆదాయం రూ.26 వేల కోట్లుంటే, ఏపీలో రూ.50 వేల కోట్లకు చేరిందని చెప్పారు. మద్యం ఆదాయాన్ని భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మద్యం ఉత్పత్తిని అడ్డుకుని, ఎక్సైజ్ చట్టాలను పటిష్టంగా అమలు చేస్తే మద్య నియంత్రణ అసాధ్యం కాదని పేర్కొన్నారు.
 
రాజధాని గ్రామాల్లో పర్యటన
సామాజికవేత్త మేధా పాట్కర్ గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించారు. పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా కృష్ణా నదీ తీరంలో వెంకటపాలెం రీచ్‌లో జరుగుతున్న ఇసుక దోపిడీని స్వయంగా పరిశీలించారు. తాత్కాలిక సచివాలయానికే ఇప్పటిదాకా రూ.800 కోట్లు దుబారా చేస్తే శాశ్వత నిర్మాణాలు ఎప్పుడు చేపడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలోని భూములను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని శంకుస్ధాపన ప్రాంతమైన ఉద్ధండరాయునిపాలెంలోనూ పర్యటించారు.

చంద్రబాబు కచ్చితంగా నేరస్తుడే
రాజధాని నిర్మాణం పేరుతో ప్రకృతి సంపదను అడ్డగోలుగా దోచుకొని, ప్రజలను దారుణంగా మోసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కచ్చితంగా నేరస్తుడేనని మేధా పాట్కర్ తేల్చి చెప్పారు. చంద్రబాబు ఇక్కడి భూములను సింగపూర్ కంపెనీలకు అప్పగించేందుకు వ్యూహం పన్నారని ఆరోపించారు. ఆమె గురువారం విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పంట భూములను బలవంతంగా లాక్కునే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని నిలదీశారు.

ఆయన కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. స్విస్ చాలెంజ్ పేరిట భారీ దోపిడీకి తెరతీశారని ఆరోపించారు. సింగపూర్‌లోని రెండు కంపెనీలతో ముందుగానే మాట్లాడుకొని ఆర్థిక లావాదేవీలు కుదుర్చుకున్నారని దుయ్యబట్టారు.
 
మునిగిపోయే చోట సచివాలయమా?
‘‘శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాజధానిని నిర్మించి ఉంటే పంట భూములు పోయేవి కాదు. ప్రస్తుతం వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం భవనాలు కొండవీటి వాగు పొంగితే మునిగిపోతాయి. ఇలాంటి ప్రాంతం, మాగాణి భూముల్లో సచివాలయం ఏమిటి? ప్రజావసరాల కోసం భూములు తీసుకోవాల్సి వస్తే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ముందుకెళ్లాలే గానీ ఇలా దురాక్రమణ చేయడం దారుణం.

ఇలాంటి పరిణామాలు ప్రజల హక్కులకు, ముఖ్యంగా దళితుల హక్కులకు భంగం కలిగిస్తున్నాయి. ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన చంద్రబాబు నేరస్తుడు కాక మరేమిటి? ఎస్సీలకు ఇచ్చిన అసైన్‌మెంట్ భూములపై చంద్రబాబుకు ఎలాంటి హక్కు లేదు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు నడుస్తున్నందున ప్రజలకు అనుకూలమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం’’ అని మేధాపాట్కర్ చెప్పారు.  
 
చంద్రబాబు ఇంటి పక్కనే ఇసుక దోపిడీ

‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపక్కనే కృష్ణా నదిలో ఇసుక దోపిడీ జరుగుతోంది. ఇది చంద్రబాబుకు తెలియకుండా జరిగే అవకాశమే లేదు. అధునాతనమైన యంత్రాలు ఉపయోగించి నదుల్లో ఇసుకను దోపిడీ చేయడం వెనుక చంద్రబాబు హస్తం ఉంది. నదుల్లో ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేస్తే పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది’’ అని మేధా పాట్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరో సామాజిక కార్యకర్త ఉపేంద్రసింగ్ రావత్ మాట్లాడుతూ... చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో పంట భూముల్లో వ్యాపారాలు చేసి, ఆ డబ్బును స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారని ఆరోపించారు.

Advertisement
Advertisement