మీ ఇంటికి...మీ రేషన్‌ అమలు అం‘తంతే’ | Sakshi
Sakshi News home page

మీ ఇంటికి...మీ రేషన్‌ అమలు అం‘తంతే’

Published Sun, Jul 24 2016 10:51 PM

మీ ఇంటికి...మీ రేషన్‌ అమలు అం‘తంతే’ - Sakshi

►  పండుటాకులకు అందని సరుకులు
► ఈ నెల 1,343 మంది పంపిణీ చేయని వైనం


జిల్లాలో నిస్సహాయులు – 4,190
వీఆర్‌ఓ అథెంటికేషన్‌ ద్వారా పంపిణీ–  2,837
సరుకులు అందని నిస్సహాయులు– 1,343


అనంతపురం అర్బన్‌: నిస్సహాయులు చౌక దుకాణానికి వచ్చి సరుకులు తీసుకుని పోలేని పరిస్థితి. దీంతో చాలా మందికి సమస్యగా మారింది. ఈ క్రమంలో చౌక దుకాణానికి రాలేని వారి ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీఆర్‌ఓ అథెంటికేషన్‌ ద్వారా ఇలాంటి వారికి రేషన్‌ పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లాలో ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉంది. జూన్‌ నెల వరకు సవ్యంగానే సాగింది. అయితే ప్రస్తుత (జూలై) నెలలో మాత్రం నిర్లక్ష్యం చోటు చేసుకుంది. పర్యవసానంగా రేషన్‌ దుకాణాలకు వెళ్లేలేని స్థితిలో ఉన్న వృద్ధులకు రేషన్‌ అందలేదు.

జిల్లా 1,343 మందికి అందలేదు
జిల్లాలో 4,190 మంది నిస్సహాయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరిMీ  ప్రతి నెలా 7వ తేదీ నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి వీఆర్‌ఓలు సరుకులు అందజేయాలి. అయితే ప్రస్తుత నెలలో వీఆర్‌ఓ అథెంటికేషన్‌ ద్వారా నిస్సహాయులకు సరుకులు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చోటు చేసుకుంది. సీఎం డ్యాష్‌ బోర్డులో అధికారులు ఉంచిన అధికారిక సమాచారం ప్రకారం 4,190 నిస్సహాయుల్లో  2,847 మందికి మాత్రమే రేషన్‌ అందించారు. 1,343 మందికి ఇవ్వలేదు. అటు రేషన్‌ దుకాణానికి వెళ్లి తీసుకోక, ఇటు వీఆర్‌ఓలు ఇవ్వకపోవడంతో చాలా మంది సరుకులు పొందలేకపోయారు. జిల్లాలోని 63 మండలాల్లో ఒకటి రెండు చోట్ల తప్ప మిగతా అన్ని మండలాల్లోనూ ఈ నెల పూర్తి స్థాయిలో నిస్సహాయులకు సరకులు అందజేయలేదు.

సాంకేతిక కారణాలతో రేషన్‌ దూరం
సాంకేతిక కారణాలను చూపిస్తూ కొందరు నిస్సహాయులకు రేషన్‌ ఇవ్వడం లేదు. వేలిముద్రలు సరిపోలడం లేదని కొందరికి, ఆధార్‌ అనుసంధానం కాలేదంటూ మరికొందరికి రేషన్‌ ఇవ్వడం లేదు. రేషన్‌ కార్డు ఉండి, వేలిముద్రలు సరిపోలని, ఆధార్‌ అనుసంధానం కాని వారికి వీఆర్‌ఓ అథెంటికేషన్‌ ద్వారా సరుకులు అందజేయాలని మంత్రే స్వయంగా చెప్పినా, వారికి మాత్రం సరుకులు అందడం లేదు.

కొందరు రేషన్‌ షాపుల్లో తీసుకున్నారు
నిస్సహాయులుగా ఉన్నవారు కొందరు రేషన్‌ దుకాణాలకు వెళ్లి సరుకులు తీసుకున్నారు. మాకు తెలిసినంత వరకు సరుకులు అందలేదనే ఫిర్యాదులు రాలేదు. ఇప్పటికీ రేషన్‌ అందని వారికి తక్షణం అందించాలని అధికారులను ఆదేశిస్తాం.
– ప్రభాకర్‌రావు, డీఎస్‌ఓ

మచ్చుకు కొన్ని మండలాలు
మండలం    నిస్సహాయులు    ఈ నెల రేషన్‌ అందుకున్నది    రేషన్‌ అందని వారు    
కుందుర్పి    254    112    142    
ధర్మవరం    298    134    164    
అనంతపురం    213    172    41    
అమరాపురం    70    38    32    
బొమ్మనహాళ్‌æ    24    10    14    
గోరంట్ల    90    48    42    
గుమ్మగట్ట    24    11    13    
పెనుకొండ    44    22    22

Advertisement
Advertisement