డామిట్‌ కథ అడ్డం తిరిగింది.. | Sakshi
Sakshi News home page

డామిట్‌ కథ అడ్డం తిరిగింది..

Published Sun, Oct 16 2016 10:47 PM

men dead issue

  • మలుపులు తిరుగుతున్న యువకుడి మృతి సంఘటన
  • ఫిర్యాదు చేసిన మృతుడి తండ్రి
  • కొనసాగుతున్న పోలీసు విచారణ
  • రామచంద్రపురం: 
    పుట్టిన రోజును గడుపుకున్న ఆనందంలో ఉండగానే ఆ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. అతని మరణం మిస్టరీగా మారి మలుపులు తిరుగుతున్న వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు  తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 11వ తేదీన పట్టణంలోని కవలవారి సావరానికి చెందిన కొవ్వుల రమేష్‌ అలియాస్‌ నాని(23) తన మిత్రులు మరో అరుగురితో కలిసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అందులో భాగంగా అర్ధరాత్రి సమయంలో కారులో తన స్నేహితులైన పోలిశెట్టి నాగు, ర్యాలి సత్యనారాయణ (బుడ్డయ్యకాపు), తోరాటి నాని, వంగా శ్రీను, కరెడ్ల ప్రసాద్, అడపా మణికంఠలతో  కలిసి పార్టీ చేసుకుని ద్రాక్షారామ వైపు కారులో వెళుతుండగా మార్గం మధ్యలో రమేష్‌ ప్రమాదానికి గురయ్యాడు. దాంతో హుటాహుటిన అతనిని మిత్రులు రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావటంతో రమేష్‌ ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికి కొన  ఊపిరితో ఉన్నాడు. డాక్టర్లు పరిశీలించిన కొద్దిసేపటికే మృతి చెందాడు. దీంతో రమేష్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అతని స్నేహితులు అదే కారులో ఇంటికి తరలించారు. ప్రమాదంలో చనిపోయాడని చెప్పడంతో రమేష్‌ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బంధుల సహాయంతో మృతదేహాన్ని ఖననం చేశారు. చనిపోయిన అయిదు రోజులకు రమేష్‌ మృతిపై వారి తల్లిదండ్రులకు, బంధువులకు పలు అనుమానాలు తలెత్తాయి. దాంతో రమేష్‌ తండ్రి సూరిబాబు తన కుమారుడి మృతిపై పలు అనుమానాలున్నాయని, తన కుమారుడు స్నేహితులైన ఆరుగురిపైనా విచారణ జరిపి నిజాలు వెలికి తీయాలని పట్టణ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు.
    ప్రమాదం జరిగినప్పటి నుంచి తలెత్తుతున్న అనుమానాలు 
    ఎంఎల్‌సీ నమోదు చేయని వైద్యులు : ఈనెల 11న ప్రమాదం జరిగిన వెంటనే ఏరియా ఆసుపత్రికి రమేష్‌ను అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చిన కొద్దిసేపటికే రమేష్‌ మృతి చెందాడు. కానీ ఆస్పత్రి వైద్యులు ఎంఎల్‌సీ నమోదు చేయలేదు. ఎంఎల్‌సీ నమోదు చేస్తే పోలీసులకు సమాచారం అందేది. రమేష్‌ ఎలా మరణించినా ఆస్పత్రికి వచ్చిన వెంటనే ఎంఎల్‌సీ నమోదు చేయాల్సిన వైద్యులు అలా చేయకపోవడంపై పలు  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం రమేష్‌తో ఉన్న స్నేహితుల్లో ఒకరు ఆస్పత్రిలో పనిచేస్తున్నట్టు తెలిసింది. అందుకే వైద్యులు ఎంఎల్‌సీ నమోదు చేయలేదని తెలుస్తోంది. సంఘటన జరిగిన ఐదు రోజుల తరువాత రమేష్‌ తండ్రి సూరిబాబు ఆదివారం తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని, ఆరోజు తన కుమారుడిని తీసుకువెళ్లిన స్నేహితులను విచారించాలని కోరుతూ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేష్‌ తండ్రి సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదం, సాక్ష్యాలను తారుమారు చేశారనే విషయంపై కేసు నమోదు చే సి నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు ఎస్సై ఎల్‌. శ్రీనునాయక్‌ తెలిపారు.  

Advertisement
Advertisement