'మోదీ, చంద్రబాబు ఏపీ ప్రజలను ముంచుతున్నారు' | Sakshi
Sakshi News home page

'మోదీ, చంద్రబాబు ఏపీ ప్రజలను ముంచుతున్నారు'

Published Sun, Oct 16 2016 5:16 PM

Meruga nagarjuna criticised Chandrababu and ap ministers

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బార్టర్ విధానం నడుస్తోంది
వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున


గుంటూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బార్టర్ (వస్తు మార్పిడి) విధానం నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును వదిలిపెడితే దానికి బదులుగా ప్రత్యేక హోదా అంశాన్ని ఆయన కూడా వదిలేశారని మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. గుంటూరు అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలంయంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నవ్యాంధ్రలో ప్రస్తుతం నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలను నిట్టనిలువునా ముంచే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

స్వలాభం కోసం కేంద్ర ప్రభుత్వం తన అవినీతి భాగోతాన్ని ఎక్కడ బయటకు తీస్తుందోనని భయపడి రైతు, మహిళ, యువజన, విద్యార్థి ప్రయోజనాలను చంద్రబాబు కృష్ణలో కలిపేశారని దుయ్యబట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు అయ్యారని చంద్రబాబు వ్యాఖ్యలు చేయటం హాస్యస్పదంగా ఉందన్నారు. కోటీశ్వరులు అయింది ప్రజలు కాదని, చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌బాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కోట్లకు పడగలెత్తుతున్నారని ఆరోపించారు. దళితుల భూములు లాక్కుంటూ కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోందని పేర్కొన్నారు. పేదల జీవితాన్ని మరింత అగాధంలోకి నెట్టివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

లోకేష్‌ను కాపాడటానికే మంత్రుల రంకెలు
అవినీతి ఊబిలో నిండా కూరుకుపోయిన లోకేష్‌బాబును కాపాడటం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు రంకెలు వేయటం సిగ్గుచేటని మేరుగ అన్నారు. వరదలు వచ్చి దళిత ప్రాంతాలన్నీ కొట్టుకుపోతే కనీసం తలెత్తి కూడా చూడని మంత్రి రావెల కిశోర్‌బాబు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఇద్దరు బాబులు కలిసి.. ఒకరు మంత్రి పదవి కోసం, మరొకరు ఊడిపోకుండా ఉండటం కోసం పెదబాబు కాళ్లు పట్టుకుంటున్నారని ఆరోపించారు.

నయవంచనకు మారుపేరైన ఆ నేతలు వైఎస్ జగన్ గురించి కారుకూతలు కూయడం మాని, నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎండీ నసీర్‌అహ్మద్, పలు విభాగాల నేతలు నూనె ఉమామహేశ్వరరెడ్డి, కొత్తా చిన్నపరెడ్డి, మొగిలి మధు, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, షస్త్రక్ జానీ, నరాలశెట్టి అర్జున్, ఆవుల సుందర్‌రెడ్డి, మెహమూద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement