Sakshi News home page

మీటరు అమర్చకుండా బిల్లుల మోత

Published Sat, Jun 25 2016 12:57 AM

Meter formatted bills Crash

* విద్యుత్ సిబ్బంది నిర్వాకం
* ఆవేదనలో వినియోగదారులు

అక్కుపల్లి(వజ్రపుకొత్తూరు): విద్యుత్ మీటరు అమర్చితే వినియోగదారునికి బిల్లు రావడం సహజం. విద్యుత్ కనెక్షన్ లేకుండా, మీటర్లు అమర్చకుండానే బిల్లుల భారం వేసిన ఘటన వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...  అక్కుపల్లి గ్రామానికి  చెందిన 11 మంది లబ్ధిదారులు ప్రధానమంత్రి దీన్ దయాళ్ యోజన పథకం కింద విద్యుత్ మీటర్లకు దరఖాస్తు చేసుకున్నారు.

దీంతో వీరికి మీటర్లు మంజూరయ్యాయి. వీరిలో ఎ.జయలక్ష్మి, సీహెచ్ నరసింహమూర్తిలు మాత్రమే ఇంటికి విద్యుత్ వైరింగ్ చేసుకుని మీటర్లు అమర్చుకున్నారు. మిగిలిన తొమ్మిది మందికి మూడు నెలల కిందట మీటర్లు ఇచ్చారే తప్ప స్తంభాలు వేయలేదు. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు. మీటర్లు అమర్చ లేదు. వీరంతా విద్యుత్ వినియోగిస్తున్నట్టు రూ.127 చొప్పున చెల్లించాలని విద్యుత్ సిబ్బంది బిల్లులు  ఇవ్వడంతో లబ్ధిదారులు అవాక్కయ్యారు.

మీటర్లు అమర్చకుండా, కనెక్షన్‌లేకుండా బిల్లులు ఎక్కడైనా ఇస్తారా అంటూ మండిపడుతున్నారు. విద్యుత్ సిబ్బంది నిర్వాకాన్ని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ బిల్లు రద్దు చేసి త్వరితగతిన కనెక్షన్ ఇవ్వాలని లబ్ధిదారులు ఎం.బాలామణి, కె.ఈశ్వరి, పల్లేటి జయలక్ష్మి తదితరులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement