వార్.. ఫైర్ | Sakshi
Sakshi News home page

వార్.. ఫైర్

Published Sun, Jun 26 2016 12:08 AM

వార్.. ఫైర్ - Sakshi

‘మల్లన్న’ సాక్షిగా ఆందోళనలు
అనుకూల, ప్రతికూల నిరసనల హోరు
చార్జీల వడ్డనపై కస్సుబుస్సు
‘పునర్విభజన’లోనూ వెల్లువెత్తుతున్న వ్యతిరేకత
మళ్లీ అట్టుడుకుతున్న  మెతుకుసీమ

చైతన్యస్ఫూర్తికి నిదర్శనం మెతుకుసీమ బిడ్డలు.. తెలంగాణ ఉద్యమంలో తెగించి కొట్లాడిన మెతుకుసీమలో మళ్లీ ఆందోళనలు పుంజుకున్నాయి. మల్లన్నసాగర్‌పై ప్రతికూల వార్ .. అనుకూల ఫైర్ నడుస్తోంది. విద్యుత్, బస్సుచార్జీల వడ్డనే అవకాశంగా ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి. జిల్లాల పునర్విభజనలో తమ ఉనికిని పదిలపరుచుకునే క్రమంలో జనం గళం ఎత్తుతున్నారు. తెలంగాణ సిద్ధించిన రెండేళ్ల విరామం తరువాత మళ్లీ తిరగబడ్డ మెతుకుసీమ పోరుబాటపై సాక్షి ప్రత్యేక కథనం..

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘తెలంగాణ వచ్చుడో...కేసీఆర్ సచ్చుడో’ లాంటి మాటల తూటాలు నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లోకి చొచ్చుకెళితే.. వీరులారా మీకు వందనమంటూ.. విప్లవ బీజాలు నాటి తెలంగాణ సాధించి పెట్టిన ఉద్యమ దివిటి కేసీఆర్ మెతుకుసీమ ముద్దుబిడ్డే. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన తరువాత మెదక్ గడ్డ ఓ యుద్ధ శిబిరంలా మారింది. కవులు, కళాకారులు, ముసలోళ్లు.. పోరగాళ్లు.. మహిళలు, పురుషులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అన్న తేడాలేకుండా గొంతులన్నీ ఏకమై పోరుబాట పట్టాయి.  ప్రతి ఊరిలోనూ తెలంగాణ నినాదమే. ఏ చేతిలోనూ తెలంగాణ జెండాయే కదలాడింది. కళాకారుల పాట లు.. పల్లెల్లో ప్రతిధ్వనించాయి. ధూంధాంలు దుమ్మురేపాయి. ఊరు ఏరై...ఉద్యమ పోరై...పోటెత్తింది. ఆ మధ్యకాలంలో చల్లబడ్డ ఉద్యమాన్ని లక్ష్మినగర్‌లో రగిలిన జాగోబాగో నినాదం మళ్లీ వేడెక్కించింది. ఆత్మబలిదానాలకు సైతం వెనకడుగు వేయలేదు మెతుకుబి డ్డ. పోరుబాటలో అసువులు బాసి.. నింగిలోని సుక్క లై.. నేటి తెలంగాణకు వెలుగులై దారిచూపుతున్నారు.

మల్లన్న సాగర్‌పై  ప్రతికూలం.. అనుకూలం
మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూసేకరణ అంశం మరో ఉద్యమానికి ఊపిరి పోసింది. బువ్వపెట్టిన  భూమిని వదులుకోలేక, ఉన్న ఊరిని వదిలి వెళ్లలేక కడుపు మండిన కొంతమంది అన్నదాతలు ఆందోళనబాట పట్టారు. అయితే మరికొంతమంది మాత్రం త్యాగం లేనిదే అభివృద్ధి ఎలా సాధ్యమంటూ రిజర్వాయర్ అనుకూలంగా ఉద్యమిస్తున్నారు. ఈ రెండు వర్గాల ఆందోళనల మధ్య రాజకీయ జోక్యం పెరగటంతో కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూసేకరణ అంశం వివాదాస్పదంగా మారుతోంది. అందివచ్చిన అవకాశాన్ని ప్రతిపక్షాలు ఆసరాగా చేసుకొని తమ అస్త్రంగా మార్చుకుంటున్నాయి.

కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే పలుమార్లు ముంపు గ్రామాల్లో పర్యటించారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మరో వైపు జేఏసీ చైర్మన్ కోదండరాం మల్లన్నసాగర్ ముంపు బాధితుల పక్షాన నిలబడుతామని, అవసరమైన జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని తీసుకవెళ్లేందుకు మేథాపాట్కార్ లాంటి ఉద్యమకారులను తీసుకువస్తామని ప్రకటించారు.  వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీపీఎం బీజేపీలు కూడా ముంపు బాధితులకు అండగా నిలబడ్డాయి. మరో వైపు  మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు అనుకూలంగా రైతు ఉద్యమాలు నడుస్తున్నాయి. సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టును పూర్తి చేసి రైతు ఆత్మహత్యలను ఆపాలని  మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రైతులు అనుకూలంగా ఆందోళనలు చేశారు. అధికారులకు వినతి పత్రాలు అందించారు.

విద్యుత్, బస్సుచార్జీల పెంపుపై భగ్గు
విద్యుత్, బస్సుచార్జీలు పెంపుపై నిర్ణయం వెలువడిన నేపధ్యంలో   ప్రజలు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై భగ్గుమంటున్నాయి. పెంచిన బస్సు ఛార్జీలతో ప్రతి రోజూ ప్రయాణికుల మీద రూ. 6 లక్షల మేరకు భారం పడుతోంది.  విద్యుత్తు  చార్జీల పెంపుతో మొత్తం రూ. 15 కోట్ల భారం పడుతుంది. చార్జీల పెంపుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్న నేపధ్యంలో ప్రతిపక్షాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి.  ఈ క్రమంలో కాంగ్రెస్‌శ్రేణులు జిల్లా అంతటా ఆందోళనలు, రాస్తారోకోలు చేపట్టాయి.

ఆయా మండలకేంద్రాల్లో తహశీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించారు. విద్యుత్, బస్సుచార్జీల పెంచడంతో సామాన్యులపై భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ ఉద్యమ బాట పడుతున్నారు.

జిల్లాల పునర్విభనలోనూ నర్సాపూర్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల నుంచి  తీవ్ర వ్యతిరేకత వస్తోంది. నర్సాపూర్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని అక్కడి  ప్రజలు రెండు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఆందోల్ నియోజకవర్గాన్ని  మెదక్ జిల్లాలో కలపొద్దని, తమకు సంగారెడ్డి జిల్లానే సౌకర్యం వంతంగా ఉంటుందని ఆందోల్ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. రెండు బైక్ ర్యాలీలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నారాయణఖేడ్‌పై ఇంకా సందిగ్ధత వీడలేదు. తాము సంగారెడ్డి జిల్లాలోనే ఉంటామని అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement