Sakshi News home page

క్షీరధారలే..‘సిరి’నామాలు

Published Fri, Dec 9 2016 11:03 PM

క్షీరధారలే..‘సిరి’నామాలు

-అవగాహన పశుపోషణ లాభదాయకం
-అందుకు పాలపోటీలు దోహదం
-15 నుంచి 17 వరకూ మండపేటలో 
రాష్ట్రస్థాయి పాలు, పశుప్రదర్శన పోటీలు
మండపేట : ఒకనాడు రైతు ఆర్థిక పరిస్థితి దాదాపు స్వయం సమృద్ధం. చేలో పంట పండితే, గట్టున కందులో, కూరలో పండేవి. దిబ్బ మీద పాకలో ఒకటో రెండో పాడిపశువులు క్షీరధారలు కురిపిస్తే, పాక పైకి పాకించిన ఆనబ, గుమ్మడి, బీర వంటి పాదులు కాయలను ఇచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. కారణాలేమైనా.. తరతరాలుగా పాడిపశువులతో ఉన్న బంధాన్ని తెంపుకొని, రైతులే పాలప్యాకెట్లు కొనుక్కుంటున్న రోజులు వచ్చిపడ్డాయి. అయినా సరే.. రైతన్నకు వ్యవసాయం తర్వాత అదనపు ఆదాయాన్ని సమకూర్చే వ్యాపకంగా నేటికీ పాడి పరిశ్రమనే ముందు చెప్పవచ్చు. సాగులో ఆటుపోట్లు ఎదురైనా జీవనోపాధికి ఎంతో కొంత భరోసానిచ్చేది పశుపోషణే. పశుపోషణపై అవగాహనలేమే రైతుల అదనపు ఆదాయానికి గండి కొడుతోందంటున్నారు మండపేటలోని రాష్ట్రపశుసంవర్ధక శిక్షణ కేంద్రం అధ్యాపకులు డాక్టర్‌ విజయకుమారశర్మ. ఆధునిక శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించడం ద్వారా మేలుజాతి పశుపోషణపై రైతులను చైతన్యవంతుల్ని చేసేందుకు పాలపోటీలు ఎంతగానో ఉపకరిస్తాయంటున్నారాయన. ఈనెల 15 నుంచి 17 వరకూ మండపేటలో రాష్ట్రస్థాయి పాలపోటీలు జరుగనున్న నేపథ్యంలో పాలపోటీల ప్రయోజనాల గురించి విజయకుమారశర్మ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..  ప్రపంచంలోని గేదెల సంపదలో మనదేశం ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తే, ఆవుల సంపదలో ద్వితీయస్థానంలో ఉంది. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలలోని ముర్రాజాతి గేదెలను అత్యంత మేలుజాతిగా భావిస్తారు. రోజుకు 20 నుంచి 25 లీటర్ల పాలిచ్చే ఈ జాతి పశువులకు విపరీతమైన గిరాకీ ఉంది. రోజుకు 4–6 లీటర్ల పాలిచ్చే దేశవాళీ గేదెల స్థానే ముర్రాజాతి పశుపోషణ రాష్ట్రంలో ఊపందుకుంటోంది. పశుపోషణ పట్ల రైతులను చైతన్యవంతుల్ని చేసేందుకు, మెళకువలపై అవగాహన కల్పించేందుకు పశుసంవర్ధకశాఖ ఎప్పటికప్పుడు పాలపోటీలను నిర్వహిస్తోంది.
 పాలపోటీల ప్రాముఖ్యత..
-పాలపోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే ఆయా జాతుల పశువులను రైతులు ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా ఎన్నో కొత్త విషయాలను తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. 
- అంతరించిపోతున్న ఒంగోలు, థియోని, పుంగనూరు జాతుల విశిష్టతలు తెలుసుకోవడం ద్వారా వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులను చైతన్యవంతుల్ని చేయేచ్చు.  
-విదేశాలకు చెందిన సంకర జాతి ఆవులు మన వాతావరణంలో ఎలా మనగలుగుతున్నాయి, రోజుకు ఎన్ని లీటర్ల పాలిస్తున్నాయో తెలుసుకోవడం ద్వారా ఆధునిక శాస్త్రీయ పద్ధతుల గురించి తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది.  
-యంత్ర పరికరాలు అవసరం లేకుండా నిర్ణీత వ్యవధిలో అధికంగా పాలిచ్చే పశువుల నుంచి పాలు తీసే విధానంపై అవగాహన ఏర్పడుతుంది.
- పశు పునరుత్పత్తిలో అవలంబించే వ్యాధి రక్షణ, యాజమాన్య విధానాల గురించి తెలుసుకోవచ్చు.
-అత్యధికంగా పాలిచ్చే మేలుజాతి గేదెలకు పుట్టిన దున్నలను భవిష్యత్‌ తరాల వీర్యదాతల్ని చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి రైతులకు అవగాహన ఏర్పడి మేలుజాతి దున్నలు మాంస విక్రయ కేంద్రాలకు తరలిపోకుండా నియంత్రించేందుకు వీలు కలుగుతుంది.
-పశుపోషణలో వివిధ ప్రాంతాల రైతులు పాటిస్తున్న మెళకువలను ప్రత్యక్షంగా చూసే వీలు కలుగుతుంది. తద్వారా రైతులను చైతన్యవంతుల్ని చేసేందుకు, పాడి సంపద వృద్ధికి పాలపోటీలు దోహదపడతాయి.
 పాలపోటీల నిబంధనలివీ..
 - ఐదు విభాగాల్లో నిర్వహించే ఈ పాలపోటీలకు సంబంధించి రోజుకు 15 లీటర్ల పైబడి పాలిచ్చే ముర్రా, జాఫర్‌బాది గేదెలు, ఎనిమిది లీటర్ల పైబడి పాలిచ్చే ఒంగోలు, గిర్‌ జాతి ఆవులు, ఐదు లీటర్ల పైబడి పాలిచ్చే పుంగనూరు ఆవులను పోటీలకు అనుమతిస్తారు. 
- డిసెంబరు 14 మధ్యాహ్నం నుంచి 15 మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పేర్లు నమోదు చేసుకుంటారు. 15న తీసిన పాలు నమూనాగానే తప్ప పోటీకి పరిగణించరు. 
- 16న ఉదయం, సాయంత్రం, 17న ఉదయం పశువైద్యుల కమిటీ పర్యవేక్షణలో తీసిన పాలను తూకం వేసేటప్పుడే రైతులు సరిచూసుకోవాలి. 
-15న సాయంత్రం తీసిన పాల దిగుబడికి, తదుపరి రోజు అనగా 16న ఉదయం తీసిన పాలదిగుబడికి వ్యత్యాసం రెండు కేజీల పైబడి ఉండకూడదు. వ్యత్యాసం ఉంటే పశువును పోటీ నుంచి తొలగిస్తారు.
-దూడలు లేని పాడిపశువులను కూడా పోటీలకు అనుమతిస్తారు.
-ఉదయం, సాయంత్రం ఆరు గంటల సమయంలో కమిటీ పర్యవేక్షణలో పాలు పితకడం ప్రారంభిస్తారు.
-పశువుల నమోదుపై పశువైద్యుల కమిటీదే తుది నిర్ణయం.
ఈ విభాగాల్లో పశు ప్రదర్శన..
ఒంగోలు, పుంగనూరు, గిర్‌ జాతుల ఆడ, మగ విభాగాల్లో, ముర్రా జాతికి చెందిన ఆడ, మగ విభాగాల్లో పశుప్రదర్శన పోటీలు జరుగుతాయి. పాలపళ్లు, రెండు నుంచి నాలుగు పళ్ల వరకు, ఆరు పళ్లు, ఆపైన విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్టు పశుసంవర్ధకశాఖ అధికారులు తెలిపారు.
పోస్టర్‌ ఆవిష్కరణ
కాకినాడ సిటీ : రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో వల్లూరి వెంకటరావు స్మారక రాష్ట్ర స్థాయి పాల పోటీలు, అందాల పోటీలు మండపేటలో నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో పోటీల పోస్టర్‌, కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ వి.వెంకటేశ్వరరావు, డివిజనల్‌ సహాయ సంచాలకుడు శ్రీనివాసరావు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్ధ ఎగ్జిక్యుటివ్‌ ఆఫీసర్‌ అంబేద్కర్‌ పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement