ఏపీ డెయిరీకి తగ్గిన పాల ఉత్పత్తి | Sakshi
Sakshi News home page

ఏపీ డెయిరీకి తగ్గిన పాల ఉత్పత్తి

Published Sat, Jul 23 2016 11:12 PM

ఏపీ డెయిరీకి తగ్గిన పాల ఉత్పత్తి - Sakshi

పులివెందుల రూరల్‌:
ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఫెడరేషన్‌(ఏపీడీడీసీఎఫ్‌), వెలుగు ఆధ్వర్యంలో సేకరిస్తున్న పాలు భారీ స్థాయిలో తగ్గిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 12 బీఎంసీల నుంచి పాలను సేకరించి హైదరాబాద్‌లోని ప్రధాన డెయిరీకి సరఫరా చేశారు. ఈ బీఎంసీల నుంచి గతేడాది ఇదే సమయంలో దాదాపు 25 వేల లీటర్ల పైచిలుకు పాలు రాగా.. ప్రస్తుతం 12 వేల లీటర్లకు మించి రావడం లేదు. జిల్లాలోని తొండూరు, లింగాల, చక్రాయపేట, రాయచోటి, సుండుపల్లె, రాజంపేట, భాకరాపేట, అనంతపురం జిల్లాలోని తిమ్మంపల్లెలోని బీఎంసీల నుంచి మాత్రమే పాలు సరఫరా చేశారు. ఇందులో కూడా కొన్ని బీఎంసీలలో కేవలం 1000 లీటర్లలోపు వస్తున్న కేంద్రాలు మరో
రెండు, మూడు ఉండటంతో అవి కూడా మూతపడే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలోని ప్రొద్దుటూరు, కొండాపురం, కమలాపురం, రైల్వేకోడూరులోని బీఎంసీలు మూతపడ్డాయి. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఏపీ డెయిరీకి రాష్ట్ర విభజన నేపథ్యంలో పశు సంవర్థక శాఖ పరిధిలో ఉన్న ఈ డెయిరీకి తీవ్ర కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దాదాపు రెండు నెలలకు సంబంధించిన నాలుగు బిల్లులు దాదాపు రూ.4 కోట్లు పెండింగ్‌లో ఉండగా.. ఇటీవల విడుదలయ్యాయి. జూలైకి సంబంధించిన మొదటి బిల్లు ఇంకా పెండింగ్‌లో ఉంది.
పాలు తగ్గిన విషయం వాస్తవమే.. :

జిల్లాలోఏపీ డెయిరీకి పాలు తగ్గిన విషయం వాస్తవమే. పాల బిల్లులు కాస్తా ఆలస్యం కావడంతో రైతులు ప్రైవేటు డెయిరీలను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ డెయిరీకే తీవ్ర నష్టం వాటిల్లింది.జిల్లాలో ప్రస్తుతం 8 బీఎంసీల నుంచి మాత్రమే పాల సేకరణ జరుగుతోంది.
         శ్రీనివాస్‌(ఏపీడీడీసీఎఫ్‌ డీఈ), పులివెందుల
 

Advertisement

తప్పక చదవండి

Advertisement