మినీ బస్సు బోల్తా | Sakshi
Sakshi News home page

మినీ బస్సు బోల్తా

Published Wed, Aug 17 2016 11:46 PM

మినీ బస్సు బోల్తా

సంబేపల్లె: మండలంలోని గున్నికుంట్ల గ్రామం దండువాండ్లపల్లె సమీపంలో బుధవారం సాయంత్రం రాయచోటి పట్టణానికి చెందిన పవన్‌ ప్రైవేట్‌ పాఠశాలకు సంబంధించిన మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇరువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా మరో ఏడు మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు రాయచోటిలోని పవన్‌ పాఠశాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో పాఠశాలకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో దండువాండ్లపల్లె సమీపంలో బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఆ బస్సు కండీషన్‌ సరిగా లేని కారణంగా రోడ్డు పక్క బోల్తా పడినా విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ మినీ బస్సులో సుమారు 40 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వారిలో శెట్టిపల్లె గ్రామం చిన్నజంగంపల్లెకు చెందిన కె.కార్తీక్‌(8వ తరగతి)కి చెయ్యి విరిగింది. శెట్టిపల్లె కస్పాకు చెందిన మస్తాన్‌(ఎల్‌కేజీ)కు తలకు గాయమైంది. అలాగే శివకుమార్, స్వర్ణలత, లోకేష్, ప్రవీణ్‌కుమార్, రోహిత్, గీతాంజలి, శివాంజలిలకు గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో వెంటనే రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కార్తీక్‌కు చెయ్యి విరగడంతో ఆ విద్యార్థికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కడపకు రెఫర్‌ చేశారు. మిగిలిన విద్యార్థులకు చికిత్స చేసి వారి ఇండ్లకు పంపించారు. విషయం తెలుసుకున్న గున్నికుంట్ల గ్రామ సర్పంచ్‌ నాగభూషణ్‌రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ విద్యార్థులను ఆసుపత్రికి తరలించేందుకు సహాయ సహకారాలు అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement