మైనింగ్‌ టూరిజంతో కొత్తశోభ | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ టూరిజంతో కొత్తశోభ

Published Sun, Jan 8 2017 10:44 PM

మైనింగ్‌ టూరిజంతో కొత్తశోభ

త్వరలో రాంపురం గనికి అనుమతులు!
రుద్రంపూర్‌ (కొత్తగూడెం): మైనింగ్‌ టూరిజం ఏర్పాటుతో కొత్తగూడెం నూతన శోభను సంతరించుకోనుంది. ఏరియా పరిధిలోని 5 ఇన్‌క్లైన్‌ గని ప్రాంతంలో మైనింగ్‌ టూరిజం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికోసం స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకటరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సింగరేణి పరిణామక్రమాన్ని తెలిపేందుకు ఒక మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఐదు లేక ఆరు ఎకరాల స్థలం కావల్సి ఉంటుంది. గురువారం అసెంబ్లీలో మైనింగ్‌ టూరిజం ఏర్పాటుపై సీఎం సానుకూలంగా స్పందించడంతో స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్థలాన్ని అన్వేషించే పనిలో పడ్డారు. 

ఏరియాలోని ఎంవీటీసీ ట్రైనింగ్‌ సెంటర్‌ పక్కన ఉన్న స్థలాన్ని టూరిజం కోసం ఇప్పటికే అధికారులు పరిశీలించారు. అలాగే ఏరియాలోని రాంపురం భూగర్భ గనిలో సుమారు 40 మిలియన్ టన్నులు బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం. ఈగని కి సంబంధించిన దాదాపు అన్ని సర్వేలు పూర్తయ్యాయి. అటవీ, ఎన్విరాల్‌మెంట్‌ శాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గురువారం అసెంబ్లీ చర్చల్లో 12 నూతన భూగర్భ గనుల ఏర్పాటు చేయనున్నుట్లు  సీఎం ప్రకటించారు. దీంతో ఆ కొత్తగనుల్లో రాంపురం ఉంటుందని అధికారులు భిప్రాయపడుతున్నారు. ఈ గని ద్వారా సుమారు వెయ్యి మంది కార్మికులకు ఉపాధి లభించనుంది.

Advertisement
Advertisement