మంత్రిది ఉన్మాద పాలన | Sakshi
Sakshi News home page

మంత్రిది ఉన్మాద పాలన

Published Sat, Jul 30 2016 9:09 PM

మంత్రిది ఉన్మాద పాలన

 
  •  ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి ఆగ్రహం
 
నెల్లూరు సిటీ: రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ పాలన ఉన్మాది పాలనను తలపిస్తోందని నెల్లూరు నగర, రూరల్‌ ఎమ్మెల్యేలు పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం సాయంత్రం విలేకరులతో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై వేటేశారని ఆరోపించారు. ఐదేళ్లుగా టౌన్‌ప్లానింగ్‌ అధికారుల కారణంగా కార్పొరేషన్‌ భ్రష్టుపట్టిందని, ప్రక్షాళన చేసేందుకే సస్పెండ్‌ చేశారని చెప్పారని, అయితే ఒక్కరు తప్ప మిగిలిన వారందరూ ఆర్నెల్లు, ఏడాది క్రితం వచ్చిన వారేనని చెప్పారు. మంత్రి ఉన్మాద నిర్ణయాలతో తప్పులు చేయనివారు బలికావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సమ్మర్‌ స్టోరేజీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై విచారణ జరుపుతామన్న మంత్రి ఎందుకు వెనుకడుగు వేశారని ప్రశ్నించారు. చేతనైతే కార్పొరేషన్‌కు నిధులు తీసుకురావాలని హితవు పలికారు. జిల్లాలో సీనియర్‌ నేతలను కాదని నారాయణకు మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆయన ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా నారాయణను సాగనంపి, మంచి మంత్రిని ఎన్నుకోవాలని సూచించారు. కార్పొరేషన్లోని అన్ని వ్యవహారాలపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 
మేయర్‌ షాడో హోటల్లో దందా
దేశంలో ఎక్కడా ఏడుగురు ఉద్యోగులపై విచారణ కూడా లేకుండా సస్పెండ్‌ చేసిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ ఆరోపించారు. మేయర్‌ షాడో హోటల్లో దందా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దందా చేసే వారిపై విజిలెన్స్‌ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మంత్రి నారాయణ ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని నిరూపించగలరానని ప్రశ్నించారు. ముందుగా మంత్రి వద్ద నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాలని డిమాండ్‌ చేశారు. మంత్రి నారాయణ ఆక్రమణలు చేసినట్లు నిరూపిస్తానని, మంత్రి నారాయణ రాజీనామా చేస్తారానని సవాల్‌ విసిరారు. తాను నిరూపించలేకపోతే రాజీనామా చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించొద్దని అధికారులకు సూచించారు. డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేషన్‌ విప్‌ బొబ్బల శ్రీనివాసయాదవ్, కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, ఖలీల్‌ అహ్మద్, దేవరకొండ అశోక్, నాయకులు వేలూరు మహేష్, కుంచాల శ్రీనివాసులు, పుల్లారెడ్డి, సత్తార్, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement