మంత్రి వాహనాన్ని అడ్డుకున్న నిర్వాసితులు | Sakshi
Sakshi News home page

మంత్రి వాహనాన్ని అడ్డుకున్న నిర్వాసితులు

Published Fri, Sep 16 2016 8:53 PM

మంత్రి వాహనాన్ని అడ్డుకున్న నిర్వాసితులు - Sakshi

నెల్లిపాక: 
గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు వాహనాన్ని ఎటపాక మండలం నెల్లిపాక జాతీయరహదారిపై పోలవరం నిర్వాసితులు అడ్డుకున్నారు. విలీన మండలాల పర్యటనకు వచ్చిన మంత్రి కూనవరం మీదుగా భద్రాచలం వస్తున్నారనే సమాచారంతో నెల్లిపాకలో అఖిలపక్షం ఆద్వర్యంలో 28 రోజులుగా దీక్షలు చేస్తున్న నిర్వాసితులు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని రహదారిపై అడ్డంగా నిలిచి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అటుగా వచ్చిన మంత్రి కారును ఆపివేయటంతో ఆయన కారు నుంచి బయటకు దిగి దీక్షలు చేస్తున్న వారి వద్దకు వచ్చారు. వారి సమస్యలను విని వినతి పత్రాన్ని అందుకున్నారు. అనంతరం మంత్రి రావెల మాట్లాడుతూ ఏడు విలీన మండలాల ప్రజలకు రాష్ట్రం రుణపడి ఉంటుందని అన్నారు. నిర్వాసితుల త్యాగాలతోనే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని, అయితే ముంపు ప్రాంత ప్రజలకు మెరుగైన ప్యాకేజీ, పునరావాసం కల్పించటంలో ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. నిర్వాసితుల  డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానని, వాటిని తప్పకుండా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. ‘ప్రభుత్వం మీద నమ్మకముంచి దీక్షలు విరమించండి. మీకు న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకుంటారు’ అని అన్నారు. మంత్రి హామీతో నిర్వాసితులు సంతృప్తి చెందారు. దాంతో దీక్షలో ఉన్నవారికి మంత్రి రావెల నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. నాయకులు కందుకూరి మంగరాజు, కొమరం ఫణీశ్వరమ్మ, కృష్ణబాబు, నలజాల శ్రీను, కరి శ్రీను, రాఘవయ్య, గంగుల నర్సింహారావు, గంజి వెంకటేశ్వర్లు, సత్యానందం తదితరులున్నారు.
 
 

Advertisement
Advertisement