‘మిషన్‌కు గండి’పై మంత్రి ఆగ్రహం | Sakshi
Sakshi News home page

‘మిషన్‌కు గండి’పై మంత్రి ఆగ్రహం

Published Mon, Aug 1 2016 10:38 PM

పెగడపల్లి పడమటి చెరువు కట్ట తెగిపోయిన దృశ్యం (ఫైల్‌)

  • పనుల తీరుపై తీవ్ర అసంతృప్తి
  • తెగిన కట్టలను పునరుద్ధరించాలని ఆదేశం
  • తాత్కాలికంగా బిల్లుల నిలిపివేత
  • సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : చిన్న నీటి వనరుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్‌ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టింది. దశల వారీగా జిల్లాలోని చెరువులు, కుంటలను అభివృద్ధి చేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. అయితే కాంట్రాక్టర్ల కకుర్తి.. సాగునీటి శాఖ అధికారుల నిర్లక్ష్యంతో మిషన్‌ కాకతీయ పనులు జిల్లాలో నాసిరకంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే మన జిల్లాలోనే మిషన్‌ కాకతీయ పనులపై ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.
     
    సకాలంలో పనులు జరగకపోవడం.. చేసిన పనుల్లోనూ నాణ్యత లోపించడం వంటి కారణాలతో సాగునీటి శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ విజయభాస్కర్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. అయినా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. మిషన్‌ కాకతీయ కింద అభివృద్ధి చేసిన పలు చెరువులు ఇటీవల వర్షాలకు తెగిపోయాయి. హసన్‌పర్తి, మద్దూరు, మంగపేట మండలాల్లోని పలు చెరువుల కట్టలకు గండ్లు పడ్డాయి. నీటిని నిల్వ చేసేందుకు చేపట్టిన మిషన్‌ కాకతీయ పనులు.. చెరువులు తెగిపోయేలా చేశాయని, నాసిరకం పనులతోనే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పనుల నాణ్యతను పర్యవేక్షించకపోవడం వల్లే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారని పలువురు అధికారులే చెబుతున్నారు.
     
    నాణ్యతను పట్టించుకోకుండా అధికారులు పనులను రికార్డు చేసి, కాంట్రాక్టర్లుకు బిల్లులు మంజూరు చేస్తుండడం మన జిల్లాలోనే ఎక్కువగా జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వర్షాలకు తెగిన చెరువుల పనులను చూసినా ఇదే స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని సాగునీటి శాఖ అధికారులపై ఆ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. చెరువులు తెగిన విషయంపై అధికారులను మందలించినట్లు సమాచారం. నాసికరం పనులపై చర్యలు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సాగునీటి శాఖ ఇంచార్జి సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌రెడ్డిని హెచ్చరించినట్లు తెలిసింది. మిషన్‌ కాకతీయలో అభివృద్ధి చేసిన చెరువుల పరిస్థితే ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించినట్లు సమాచారం. మిషన్‌ కాకతీయ రెండో దశ టెండర్ల సమయంలోనూ మంత్రి హరీశ్‌రావు జిల్లా అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా పనుల నాణ్యత విషయంలోనూ అదే పరిస్థితి వచ్చింది. 
     
    బిల్లుల చెల్లింపు నిలిపివేత..
    మిషన్‌ కాకతీయ పనుల్లో నాణ్యతను పట్టించుకోకుండా బిల్లులు మంజూరు చేస్తున్న విషయంలో ఆరోపణలు పెరుగుతుండడంతో రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించారు. పనుల నాణ్యతను పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తర్వాతే బిల్లులు మంజూరు చేయాలని సూచించారు. కట్టలు తెగిపోయిన చెరువుల పనులకు బిల్లులు చెల్లింపును నిలిపివేయాలని.. మళ్లీ పనులు చేయించిన తర్వాతే బిల్లుల మంజూరు విషయం పరిశీలించాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తానికి వానలతో దెబ్బతిన్న మిషన్‌ కాకతీయ చెరువుల విషయం సాగునీటి శాఖ జిల్లా అధికారుల్లో ఆందోళన పెంచుతోంది.
     
     

Advertisement
Advertisement