Sakshi News home page

యువతకు స్ఫూర్తి చెవిరెడ్డి

Published Tue, Sep 6 2016 11:57 PM

పట్టువస్త్రాలను తీసుకువస్తున్న డాక్టర్‌ కృష్ణప్రశాంతి, హరనాథరెడ్డి దంపతులు

తుమ్మలగుంట(తిరుపతి రూరల్‌):  ఆధ్యాత్మిక, ప్రజాసేవ కార్యక్రమాలలో చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి యువతకు స్ఫూర్తి అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి కొనియాడారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా తుమ్మలగుంట శ్రీకల్యాణ వెంకన్న ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో 10వేల పీచు టెంకాయలతో ఏర్పాటు చేసిన భారీ నారీకేళ వినాయక విగ్రహానికి  భూమన ప్రథమ పూజలు చేశారు. అంతకు ముందు కళ్యాణ వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ యువతలో భక్తిభావం పెంపొందించేందుకు భాస్కర్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పర్యావరణానికి హాని కలుగకుండా మట్టితో తయారు చేసిన 25 వేల  వినాయక విగ్రహాలను చెవిరెడ్డి ఉచితంగా అందించడం హర్షణీయమని తెలిపారు. 
యువతను సన్మార్గం వైపు నడిపించాలనే...
 పర్యావరణ పరిరక్షణలో భాగంగానే  రాయలసీమలోనే ఎక్కడా లేని విధంగా 10వేల పీచు టెంకాయలతో 43 అడుగుల ఎత్తులో భారీ నారీకేళ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు  చంద్రగిరి ఎమ్మెల్యే,  కళ్యాణ వెంకన్న ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా ముస్లింలు ఆష్రాఫ్, షరీఫ్‌  భక్తితో 516 కిలోల భారీ లడ్డూను స్వామి వారికి సమర్పించారని చెప్పారు. ఆరవ రోజు శనివారం లడ్డూ వేలం జరుగుతుందని,   ఆదివారం నిమజ్జనం జరుగుతుందన్నారు. నిమజ్జన ఊరేగింపులో పాల్గొనే భక్తులందరికీ వినాయక విగ్రహం తయారీకి ఉపయోగించిన కొబ్బరికాయలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.  ఈ కొబ్బరికాయను ఇంటి ముందు కట్టినా,  పూజకు వాడినా శుభం జరుగుతుందని పండితులు తెలిపారని చెప్పారు.
  పట్టువస్త్రాలు సమర్పించిన డాక్టర్‌ కృష్ణప్రశాంతి దంపతులు
నారీకేళ వినాయకుడికి హర్షిత ఆస్పత్రి అధినేతలు డాక్టర్‌ సిద్ధా హరినాథరెడ్డి, డాక్టర్‌ కృష్ణప్రశాంతి గజమాలను, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంటి నుంచి విగ్రహాం వరకు మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా వీటిని తీసుకువచ్చారు.  సర్పంచ్‌ మించల జయలక్ష్మి, ఉపసర్పంచ్‌ గోవిందరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు సరస్వతీ, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, మాజీ సర్పంచ్‌ చెవిరెడ్డి జయచంద్రారెడ్డి,  సిద్ధారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement