Sakshi News home page

పాదయాత్రతో ప్రభుత్వాన్ని మేలుకొలపాలి

Published Wed, May 24 2017 11:19 PM

mla viswa and shankarnarayana statement on government policies

- ఎమ్మెల్యే విశ్వ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ
- ‘మేలుకొలుపు పాదయాత్ర’ పోస్టర్ల  ఆవిష్కరణ


అనంతపురం : ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టబోయే పాదయాత్రతో ప్రభుత్వాన్ని మేలుకొలపాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పిలుపునిచ్చారు. శింగనమల నియోజకవర్గంలో ఈనెల 24 నుంచి చేపట్టబోయే పాదయాత్రకు సంబంధించి వాల్‌పోస్టర్లను బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విశ్వేశ్వరరెడ్డి, శంకరనారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి, శంకరనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో శింగనమల నియోజకవర్గాన్ని వందేళ్ల వెనక్కు తీసుకెళ్లారని ధ్వజమెత్తారు.

తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ కింద జిల్లాలో ఉన్న ఆయకట్టులో దాదాపు సగం శింగనమల నియోజకవర్గంలోనే ఉందన్నారు. మూడేళ్లలో ఈ ఆయకట్టుకు కనీసం ఆరుతడి పైరుకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. గతేడాది హెచ్‌ఎల్‌సీ, హంద్రీనీవాకు 36 టీఎంసీల నీళ్లు వచ్చినా ఒక ఎకరాకు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఎక్కడో ఉన్న గొల్లపల్లికి నీళ్లు పోయాయని, హెచ్‌ఎల్‌సీ సిస్టం కింద కూతవేటు దూరంలో ఉన్న శింగనమల, బుక్కరాయసముద్రం చెరువులతోపాటు నియోజకవర్గంలో ఏ ఒక్క చెరువుకూ నీళ్లివ్వలేదని విచారం వ్యక్తం చేశారు. కూలీలను ఇంకుడు గుంతలకు మాత్రమే పరిమితం చేసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. టీడీపీ నాయకులు మాత్రం కాంట్రాక్టర్ల అవతారమెత్తి ఉపాధిహామీ పనులను జేసీబీలతో చేయించి రూ.కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు. నిరంతర ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతున్న అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని జొన్నలగడ్డ పద్మావతి పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు.

ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలపై సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈనెల 26 నుంచి జూన్‌ 4 వరకు పాదయాత్ర ఉంటుందన్నారు. చివరిరోజు గార్లదిన్నెలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యల్లనూరు జెడ్పీటీసీ కేవీ రమణ, పార్టీ ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సాకే రామకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, నార్పల, పుట్లూరు, శింగనమల మండలాల కన్వీనర్లు రఘునాథరెడ్డి, రాఘవరెడ్డి, చెన్నకేశవులు, మార్కెట్‌యార్డ్‌ మాజీ ఉపాధ్యక్షుడు ముసలన్న, జిల్లా కమిటీ మెంబరు అమ్మవారిపేట రామ్మోహన్‌రెడ్డి, బొమ్మలాటపల్లి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement