ఓటు నమోదుకు వసూళ్లు | Sakshi
Sakshi News home page

ఓటు నమోదుకు వసూళ్లు

Published Mon, Feb 19 2018 1:27 PM

money collection for new vote registration - Sakshi

నెల్లూరు(వీఆర్సీ సెంటర్‌): నెల్లూరు నగరంలోని ఐదో డివిజన్‌ పాత చెక్‌పోస్టు, అహ్మద్‌నగర్‌ ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా పోలింగ్‌ బూత్‌ నంబరు 106లో కొత్త ఓటుహక్కు నమోదు కార్యక్రమాన్ని పోలింగ్‌ బూత్‌ ఆఫీసర్‌ మంజుల చేపట్టారు. అయితే నమోదు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్తగా నమోదు చేసుకునే ఓటరు నుంచి రూ.30 వసూలు చేశారని కొందరు స్థానికులు తెలిపారు.

అలాగే ఇంటింటికీ వెళ్లి ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా ఒకచోట కూర్చుని కొందరి వద్దే వివరాలు సేకరించి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికీ 400 మందికి కొత్తగా ఓటు నమోదు చేసుకునే అవకాశం లేకుండాపోయిందని వాపోతున్నారు. అంతేకాక బీఎల్‌ఓ ఇంటికి వచ్చి మీరు ఎవరికి ఓటువేస్తారు? అని అడగడం.. చంద్రబాబునాయుడుకు ఓటు వేయండంటూ బహిరంగంగానే ప్రచారం చేయడంపై స్థానికులు, నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

కొత్త ఓటు నమోదు చేయలేదు
కొత్తగా ఓటు నమోదు ప్రక్రియకు ఆదివారం చివరిరోజు. మా ఇంటికి ఎవరూ రాలేదు. నాకు ఓటు హక్కు రాదేమోనని భయంగా ఉం ది. ప్రతి ఇంటికి వచ్చి కొత్త ఓటర్లను నమోదు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అలాంటిది జరగలేదు.   – ఎస్‌కే మస్తాన్, బేల్దారి, అహ్మద్‌నగర్‌

ఓటు నమోదుకురూ.30 తీసుకున్నారు
మంజుల రెండు రోజుల నుంచి ఇక్కడ ఓటు నమోదు కార్యక్రమమంటూ వచ్చింది. అయితే మా ఇంట్లో పాత ఓట్లకు ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. కొత్తగా ఓటు రాయించుకున్నందుకు రూ.30 అడిగి తీసుకుంది. ఎందుకని అడిగితే ఖర్చులకు కావాలి, పోస్టు ఖర్చులకు అని చెప్పింది. – ఖాదర్‌బీ, బోడిగాడితోట

Advertisement

తప్పక చదవండి

Advertisement