Sakshi News home page

బైక్‌లో సొత్తు చోరీ

Published Thu, Nov 10 2016 12:26 AM

బైక్‌లో సొత్తు చోరీ - Sakshi

  • నిఘా కళ్లకు చిక్కిన దొంగలు
  •  రూ.90 వేల సొత్తు స్వాధీనం
  • నెల్లూరు (క్రైమ్‌): ఇద్దరు వ్యక్తులు బైక్‌ ఢిక్కీలోని నగదును అపహరించారు. ఇదంతా సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌లో రికార్డ్‌ అయింది. దాని ఆధారంగా పోలీసులు డిక్కీ దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్ట్‌ చేశారు. స్థానిక పోలీసు పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ విశాల్‌గున్నీ నిందితుల వివరాలు వెల్లడించారు. నెల్లూరు ఎన్‌జీఓ కాలనీకి చెందిన గాదంశెట్టి సుధాకర్‌రావు అక్టోబర్‌ 30వ తేదీ నగరంలోని ఓ బ్యాంక్‌లో రూ.95 వేల నగదు డ్రా చేశాడు. ఆ మొత్తాన్ని బైక్‌ డిక్కీలో పెట్టాడు. గమనించిన పాతనేరస్తులు నవాబుపేట రామచంద్రాపురానికి చెందిన వేమూరి ఆనంద్, కపాడిపాళెంకు చెందిన అరవ రవి ఆటోలో అతన్ని వెంబడించారు. సుధాకర్‌ అన్నమయ్య సర్కిల్‌ సమీపంలోని  ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద బైక్‌ను నిలిపి లోనికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆటోలో ఉన్న వేమూరి ఆనంద్‌ బైక్‌ పక్కగా ఎవరికి అనుమానం రాకుండా మూత్ర విసర్జన చేస్తున్నట్లు నటిస్తూ పరిసరాలను గమనించారు. ఎవరూ లేరని నిర్ధారించుకున్న అనంతరం డిక్కీని తెరిచి అందులో ఉన్న నగదును అపహరించి ఆటోలో పరారయ్యారు. కొద్ది సేపటికి బైక్‌ వద్దకు వచ్చిన సుధాకర్‌ డిక్కీ తెరచి ఉండటంతో నగదు చోరీకి గురైందని గ్రహించి నాల్గోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
    నిందితులు పట్టుబడింది ఇలా.. 
    దర్యాప్తులో భాగంగా నాల్గోనగర ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ సీతారామయ్య, ఎస్‌ఐ అలీసాహెబ్, రఘునాథ్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నాయి. దీంతో పోలీసుఽలు అన్నమయ్య సర్కిల్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా చోరీ జరిగిన తీరు రికార్డు అయి ఉంది. నిందితులు ఉపయోగించిన ఆటో నంబర్, నిందితుల చిత్రాలు ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులు మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన సొత్తులో రూ.90 వేలు, ఆటోను స్వాధీనం చేసుకొన్నారు. అరెస్ట్‌ చేసి చోరీ సొత్తు రాబట్టుటకు కృషి చేసిన నాల్గోనగర ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ సీతారామయ్య, ఎస్‌ఐలు అలీసాహెబ్, రఘునాథ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఆర్‌. సురేష్‌కుమార్, కానిస్టేబుల్స్‌ మహేంద్రరెడ్డి, వేణు, రాజేంద్రప్రసాద్, శివకృష్ణను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.  
    తొలికేసు 
    నేర నియంత్రణకు నగరంలోని అన్నీ ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దానిని కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌కు అనుసంధానం చేశామన్నారు. కమాండ్‌కంట్రోల్‌ సిస్టమ్‌ ద్వారా నేడు తొలిసారిగా నేరస్తులను పట్టుకోవడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు.  
     
     

Advertisement
Advertisement