‘కస్తూర్బా’లో కోతుల బాధ | Sakshi
Sakshi News home page

‘కస్తూర్బా’లో కోతుల బాధ

Published Tue, Sep 13 2016 11:10 PM

‘కస్తూర్బా’లో కోతుల బాధ

నిజాంసాగర్‌ :
అటవీ ప్రాంతాల్లో సంచరించాల్సిన వానరసైన్యం జనారణ్యంలో స్వైరవిహారం చేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోకి కోతులు వెళ్తున్నాయి. ఈ పాఠశాలలు మండల కేంద్రానికి దూరంగా ఉండడంతోపాటు ప్రహరీలూ లేవు. వంటశాలలతో పాటు స్నానపుగదులు, మూత్రశాలలు, తరగతి గదుల్లోకి కోతులు వస్తున్నాయి. విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో వారిపై దాడులకు దిగుతున్నాయి. చేతుల్లో ఉన్న వస్తువులతో పాటు ప్లేట్లల్లో ఉన్న ఆహారాన్ని ఎత్తుకెళ్తున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. దీంతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల నిజాంసాగర్‌ కేజీబీవీలో సుమలత, శ్రావణి అనే విద్యార్థినులపై కోతులు దాడి చేశాయి. మండలకేంద్రంలోని బీసీ, ఎస్సీ వసతి గృహాలు, నవోదయ విద్యాలయంలోనూ కోతుల బెడద ఉంది. 
 
కోతుల బెడద ఎక్కువగా ఉంది
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ ఏడాది కోతుల బెడద ఎక్కువైంది. అటవీ ప్రాంతానికి ఆనుకుని విద్యాలయం ఉండడంతో కోతులు ఇక్కడికి వస్తున్నాయి. విద్యార్థులపై దాడులు చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయపడుతున్నాం. కోతుల బెడద విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. 
– సరోజన, కేజీబీవీ ప్రిన్సిపాల్, నిజాంసాగర్‌ 

Advertisement
Advertisement