ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ పై మరిన్ని చర్యలు | Sakshi
Sakshi News home page

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ పై మరిన్ని చర్యలు

Published Tue, Jul 26 2016 6:21 PM

More Actions on the Film Nagar Cultural Centre

రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్‌ఎన్‌సీసీ)లో నిర్మాణంలో ఉన్న పోర్టికో కుప్పకూలిన ఘటనలో కాంట్రాక్టర్ కొండల్‌రావు, సైట్ ఇంజనీర్ సుధాకర్‌రావు, సెంట్రింగ్ కాంట్రాక్టర్ బాలరాజులను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం విచారించారు. ఈ ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో ఆదివారం పోర్టికో కూలిన ఘటనకు గల కారణాలను ఆరా తీశారు. ఇదే ఘటనకు సంబంధించి ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు కే.ఎస్.రామారావుతో పాటు కార్యదర్శికి విచారణకు హాజరుకావాలని బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరిపై కూడా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదుచేసి విషయం విదితమే.


ఎఫ్‌ఎన్‌సీసీ కార్యవర్గంపై సెక్షన్ 304(పార్ట్2)..?
ఈ ఘటనలో అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కార్యవర్గంపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న సెక్షన్లతో పాటు అదనంగా 304(పార్ట్2) సెక్షన్‌ను నమోదు చేయాలని, దర్యాప్తును ముమ్మరం చేయాలని తలపెట్టారు. ఇందులో భాగంగానే పోర్టికో నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అనుమతి ఉందా? రాత్రి పూట శ్లాబ్ వేయాల్సిన అవసరం ఏంటి? అన్నదానిపై ఆరా తీస్తున్నారు. నిర్లక్ష్యంగా శ్లాబ్ నిర్మాణం చేపట్టి ఇద్దరి మరణానికి కారకులయ్యారంటూ ఇప్పటికే ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడిపై కేసు నమోదుకాగా దీని తీవ్రతను పెంచాలని యోచిస్తున్నారు.

Advertisement
Advertisement