ఆ రోజు ఏం జరిగింది | Sakshi
Sakshi News home page

ఆ రోజు ఏం జరిగింది

Published Sun, Feb 28 2016 9:47 AM

ఆ రోజు ఏం జరిగింది - Sakshi

అనూష ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు

కంబాల చెరువు (రాజమహేంద్రవరం): ఏమే.. నీ ఫిజిక్స్ బుక్ ఇవ్వవే... సోమవారం తెచ్చిస్తా అంటూ అనూష తన స్నేహితురాలిని అడిగింది. కళాశాలలో మిగిలిన స్నేహితులతోనూ బాగానే మాట్లాడింది. అదే వారంతా చివరిగా మాట్లాడడం, చూడడం.. ఏమైందో తెలియదు శనివారం మాములుగానే ఉన్న ఆమె సోమవారం ఆత్మహత్య చేసుకుంది. అసలు ఆదివారం (21వ తేదీన) ఏం జరిగిందనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
రంగంపేట మండలం పెదరాయవరం చెందిన అనూషజ్యోతి (18) మృతిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాజమహేంద్రవరం వి.టి. కళాశాలలో బీఎస్సీ ఫస్టియర్ చదువుతున్న ఆమె అదే కళాశాలలో చదువుతున్న ఓ యువకుడి వేధింపులు భరించలేక ఈ నెల 22నఇంటి వద్ద  కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన ఈ సంఘటనపై 24న కళాశాల ముందు అనూష తండ్రితోపాటు విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
 
కళాశాలకు ఎందుకు వెళ్లలేదు?
అనూష తండ్రి సత్తిబాబు వ్యవసాయ కూలీ. తల్లి నారాయణమ్మ జీడిపిక్కల ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. ఆదివారం కావడంతో నారాయణమ్మ పనికి వెళ్లలేదు. ఆ రోజంతా అనూష తన స్నేహితుల వద్ద నుంచి పుస్తకాలు తీసుకెళ్లినా వాటిని ఒక్కసారి బయటకు తీయలేదు. సోమవారం కళాశాలకు వెళదామనుకున్న ఆమె ఎందుకు వెళ్లలేదు? ఇంతలోనే ఏం జరిగిందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
 
తండ్రి ఆవేదన..
అనూష ఆత్మహత్య చేసుకోలేదన్న వాదనా వినిపిస్తోంది? తన కుమార్తెను ఎవరో చంపేసి ఉంటారని తండ్రి సత్తిబాబు అంటున్నాడు. ఒకవేళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని అంటిం చుకుని ఉంటే బాధతో ఆమె గట్టిగా అరవాలి, లేదా బయటకు పరుగులు తీయాలని, ఆ రోజు మధ్యాహ్నం ఆ ప్రాంతమంతా ప్రశాంతంగానే ఉందని స్థానిక మహిళలు అంటున్నారు.  మరోవైపు అనూష ఇంటికి తలుపులు సరిగాలేని విషయాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు. రంగంపేట పోలీసులు దీనిని ఆత్మహత్యగానే కేసు నమోదుచేశారు. సంఘటనకు సంబంధించి ఆనవాళ్లు లేకపోవడం, అనూష అంత్యక్రియలు పూర్తికావడంతో తమకు ఎటువంటి ఆధారాలు లేకుండా పోయాయని రంగంపేట ఎస్సై సన్యాసినాయుడు ‘సాక్షి’కి తెలిపారు.
 
పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
విజయ్‌కుమార్ తనను వేధిస్తున్నాడని గత ఏడాది డిసెంబర్‌లోనే ప్రిన్సిపాల్‌కు అనూష లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. క్షమాపణ లెటర్ రాయించుకుని విజయకుమార్‌ను మందలించి వదిలేశారు. అయినా అనూషపై వేధింపులు ఆగలేదు. తర్వాత ఆమె ఫిర్యాదు చేసినా ప్రిన్సిపాల్ శ్రీరామచంద్రమూర్తి, వేరొక అధ్యాపకుడు ఇరువురి మధ్య రాజీ చేశారు. ఈ విషయాన్ని కళాశాల నిర్వాహకులకు, పోలీసులకు ఎందుకు తెలపలేదని పలువురు అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు.
 
పరారీలో విజయ్‌కుమార్, కుటుంబసభ్యులు
అనూష ఆత్మహత్య కేసులో నిందితుడు మణికంఠ విజయ్‌కుమార్ పరారీలోనే ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందం గాలిస్తోందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు రాజమహేంద్రవరం నారాయణపురంలోని విజయ్‌కుమార్ ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. అతడి తల్లిదండ్రులు ఆచూకీ లేదు. ఎస్‌కేవీటీలో విజయ్‌కుమార్ బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతున్నా అతను కళాశాలకు వెళ్లేది తక్కు వ. ఈ కేసుకు సంబంధించి ఏమైనా ఆచూకీ లభిస్తుందనే కోణంలో మృతురాలిని అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశం నుంచి బూడిదను, సంఘటన జరిగిన ప్రాంతంలోని మట్టిని పోలీసులు సేకరించారు.

Advertisement
Advertisement