రియోను మించేలా సంబరాలు | Sakshi
Sakshi News home page

రియోను మించేలా సంబరాలు

Published Fri, Aug 19 2016 11:37 PM

రియోను మించేలా సంబరాలు

డీజైవైసీ ప్రకటన
(సిటీ డెస్క్‌)
‘ఈ ఏడాది దినోత్సవ సంబరాలు రియోను మించి చేయాలని నిర్ణయించాం..ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. 120 ఏళ్ల చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పేలా విశాఖలోని పూర్ణామార్కెట్‌ను ఎంచుకున్నాం. గంటకొక ప్రాంతంలో సంబరాలు అంబరాన్ని తాకేలా నిర్వహించాలని తీర్మానించాం’ అని విశాఖ డీజేవైసీ (దోమల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ) ప్రకటించింది. సరిగ్గా 1897 ఆగస్టు 20న మా సోదరి ఎనాఫిలిస్‌ దోమ వలన మానవులకు మలేరియా వ్యాపిస్తుందని విషయాన్ని కనుగొన్న సర్‌ రోనాల్డ్‌ రాస్‌ను గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాలు నిర్వహించనున్నాం. నిజంగా ఆయనే కానీ ఈ విషయాన్ని బయటపెట్టకపోయి ఉంటే మా జాతి అంత గౌరవం లభించేది కాదు. మేము లేని ప్రాంతం లేదు. మేము గీ పెట్టకుండా ఉంటే ఎందరో గాఢనిద్రలోకి జారుకుని ఊబకాయులుగా మారిపోతారు. అంతేకాదు మా మీద కొన్ని వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో మా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో గాల్లో ఎగిరే ర్యాలీ చేయాలని నిర్ణయించాం. ఈ సమావేశం నొవెటల్‌ నిర్వహించాలని మొదట అనుకున్నాం. అయితే ప్రభుత్వం రహదారి భద్రతపై రెండు రోజుల పాటు జాతీయ వర్క్‌షాప్‌ ఏర్పాటు చేసి మా ఉనికిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. అందుకే పూర్ణామార్కెట్‌లో మాకిష్టమైన చెత్తాచెదారం మధ్య ఈ 120 ఏళ్ల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు డీజేవైసీ ప్రకటించింది. సమావేశానికి ఎనాఫిలస్, క్యూలెక్స్, ఈడిస్, జపనిస్‌ ఎన్‌సెఫలైటిస్‌ దోమలు ముఖ్య అతిథులుగా హాజరయ్యాయి. ఈ సందర్భంగా ఎనాఫిలస్‌ మాట్లాడుతూ...కలలో కూడా ఊహించలేదు. మేం ఇంత గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌ చేసుకుంటామని, అదంతా అధికారులు, ప్రజాప్రతినిధులు దయే. వారికి ఈ సందర్భంగా కతజ్ఞతలు తెలుపుతున్నాం. 
ఇక్కడే ఎందుకంటే...!
ఎన్నో ప్రాంతాలు ఉండగా ఇక్కడే ఉత్సవాలను జరుపుకోవడానికి కారణం.. గత గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కరం రోజులు పారిశుధ్య కార్మికులు ఆందోళన చేసి తమ జాతి వద్ధికి ఎంతో సహకరించారు. మేం దినోత్సవం జరుపుకునే నాటికి కష్ణాపుష్కరాలు జరుగుతుండటంతో యాదచ్ఛికమే అయినా...మాకూ... పుష్కరాలకు..మాకూ.. జీవీఎంసీ పారిశుధ్య విభాగానికి తరతరాల అనుబంధం ఏదో ఉంది. కార్మికులంతా పుష్కర సేవలకు వెళ్లడంతో నగరంలో చెత్తాచెదారం పెరిగిపోతోంది. అది మాకు కలిసొచ్చే అంశం. మరిన్ని ఎక్కువ దోమలు వద్ధి చెందడానికి మాకు ఇంతకంటే మంచి అవకాశం లేదు. ఈ విధంగా ముందుకు పోతున్న చంద్రబాబు సర్కార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయనే సీఎంగా లేకుంటే మాకు ఇంత పేరుప్రఖ్యాతలు వచ్చి ఉండేవి కావు. అందుకని ఆయన ఎక్కడుంటే అక్కడ మా దోమల దండు అండగా ఉంటుంది. అలాగే ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోని అధికారులకు కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. వారికి ‘దోమస్కార్‌’ అవార్డులు ఇవ్వాలని కమిటీ తీర్మానించింది. అవార్డు కింద టార్టోయస్, మస్కిటో క్వాయిల్స్, దోమ తెరలు ఇవ్వాలని నిర్ణయించాం. 
సర్కారు, అధికారుల జోలికిపోకూడదని...
 సర్కారు, అధికారుల జోలికి మేం పోకూడదని ‘చిటుకుచిటుకు’ మంటూ నిర్ణయం తీసుకున్నాం. వాళ్లు గానీ స్వయంగా బాధ అనుభవిస్తే మాపై కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. అందుకని ఆ నిర్ణయం తీసుకున్నాం. ఇక పోతే...మాకు నవ్వు తెప్పించేలా అప్పుడప్పుడూ మున్సిపల్‌ అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు. చెత్త తొలగిస్తాం...ఫాగింగ్‌చేస్తాం...బ్లీచింగ్‌ జల్లుతామని... ఎన్నాళ్లునుంచే ఈ ప్రకటనలు వినీవినీ బోరు కొడుతోంది. ఫాగింగ్‌ మాకు స్ప్రేతో సమానం... బ్లీచింగ్‌ మాకు ఫేసుకు రాసుకునే పౌడర్‌... లేకపోతే ఇప్పటికే మా జాతి అంతరించేది. మనుషులు టెక్నాలజీతో పోటీపడుతుంటే మేము మాత్రం వెనుకబడే ఉన్నామనుకుంటే ఎలా? మరీ విడ్డూరం కాకపోతే...పసుపునకు..కీటకాలను నాశనం చేసే గుణం ఉంటుంది. అదే పసుపు ఎక్కువై గత గోదావరిలో పుష్కరాల్లో ఈకోలీ బ్యాక్టీరియా పుట్టుకువచ్చింది. దీంతో పసుపు కూడా మమ్మల్ని ఏమీ చేయలేక చేతులెత్తేసినందుకు గర్వంగా ఉంది. ఈ నేపథ్యంలో మా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఈకోలీ బ్యాక్టీరియాను ఆహ్వానిస్తున్నాం. విశాఖజిల్లాలో ఎడిస్,సూరోఫోరా, హిరోనోటేలియా, ఎల్లోఫీవర్‌ దోమలు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షంచనున్నాయి. 
దోమయోగా..!
 క్యూలెక్స్, ఈడిస్‌ దోమలు మాట్లాడుతూ...నగరంలో కొత్తగా వచ్చిన కమిషనర్‌ అక్కడక్కడా చెత్త తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మా సభ్యులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. వీరి ఆందోళన జయించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 2700 రకాల దోమలను విశాఖ రప్పిస్తున్నాం. వాళ్ల చేత ‘దోమయోగా’ కార్యక్రమం నిర్వహించనున్నాం. బ్లీచింగ్, ఫాగింగ్‌చేసేటప్పుడు  యోగాసనాలద్వారా వాటì  నుంచి తప్పించుకునేలా శిక్షణ ఇస్తాం. ఈ కార్యక్రమానికి మాకు స్ఫూర్తి కమలనాథులే. వారికి కూడా ఈ సందర్భంగా కతజ్ఞతలు తెలుపుతున్నాం. 
120 ఏళ్ల పండుగకు భారీ ఏర్పాట్లు
ఇక 120 ఏళ్ల  పండగకు కోట్లాది దోమలు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ప్రధాన మురికికాలువలు, టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్త కుప్పలను సిద్ధం చేశాం. చరిత్రలో నిలిచిపోయేలా నేషనల్‌ జియోగ్రఫీ ఛానల్, స్టార్‌ గ్రూప్‌ ఛానల్స్‌తో  ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ ఈవెంట్‌కు దర్శకత్వ బాధ్యతలను  ‘దోమపాటి’కి అవకాశం కల్పించాం. వీలైనన్ని చెత్త కుప్పలను సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. మిగిలిన వివరాలకు డీజేవైఏ అని స్పేస్‌ ఇచ్చి 5757కు ఎస్‌ఎంఎస్‌ చేస్తే ఎప్పటికప్పుడు మీకు అప్‌డేట్స్‌ అందిస్తామని దోమల సంఘం ప్రకటించింది. సమావేశం అనంతరం అన్ని కలిసి సెల్ఫీలతో సందడి చేశాయి. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement